అందరికీ ఆరోగ్యమస్తు | VIP Sakshi Reporter as Armoor MLA Asannagari jeevan reddy | Sakshi
Sakshi News home page

అందరికీ ఆరోగ్యమస్తు

Published Mon, Jan 12 2015 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

అందరికీ ఆరోగ్యమస్తు

అందరికీ ఆరోగ్యమస్తు

సాక్షి విఐపి రిపోర్టర్ : ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
అక్షర క్రమంలో ముందున్న ఆర్మూర్ నియోజకవర్గంలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుబాటులో ఉంటున్నాయి. దశాబ్దం క్రితం పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను నిర్మించినా, నేటికీ పూర్తి స్థాయి సేవలు అందడం లేదు. కేవలం పది పడకలతో నెట్టుకొస్తున్నారు. 64వేల పైచిలుకు జనాభా ఉన్న పట్టణంలో పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లి గ్రామాలు కలిసిపోయాయి. వీరందరినీ కలుపుకుంటే 80 వేల పై చిలుకు జనాభా అవుతుంది. ఈ పట్టణం మీదుగా 44, 63వ నంబర్ జాతీయ రహదారులు వెళ్తుంటాయి.

జాతీయ రహదారుల కూడలి కావడంతో రోడ్డు ప్రమాదాలు తరుచుగా జరుగుతుంటాయి . క్షతగాత్రులకు చికిత్స చేయడానికి ట్రామా కేర్ సెంటర్ కూడా లేదు. ఆర్మూర్ ఆస్పత్రిని వంద పడకలకు పెంచి రోగులకు అవసర మైన అన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఈ ప్రాంత ప్రజలు దాదాపు 25 సంవత్సరాలుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీ వన్‌రెడ్డి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టరుగా ఆస్పత్రిని సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు.
 
వైద్యసేవలను మెరుగుపరుస్తాం
వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తాం
25 ఏళ్ల కలను సాకారం చేస్తాం
గైనకాలజిస్టునూ నియమిస్తాం
అందుబాటులోకి ట్రామా సెంటర్
ఆర్మూరు ఎమ్మెల్యే ఎ. జీవన్‌రెడ్డి

 
జీవన్‌రెడ్డి : ఏ ఊరక్కా మీది? ఏ బాధతో ఆస్పత్రికి వచ్చారమ్మా?
చిన్నక్క :
అయ్యా మాది ఆర్మూరే. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన. డాక్టర్లు చూసి మందులిచ్చిండ్రు.
 
జీవన్‌రెడ్డి : డాక్టర్లు అందుబాటులో ఉన్నరా.? మంచిగ చూసిండ్రా లేదా?
చిన్నక్క :
ఆదివారం కదా డాక్టర్లు ఉంటరో లేదో అనుకొని వచ్చిన, డాక్టర్ ఉన్నడు. పరీక్ష చేసి మందులు కుడ రాసిచ్చిండు. మంచిగనే చూస్తున్నరు.
 
జీవన్‌రెడ్డి : ఫీజేమైనా ఇచ్చినవా డాక్టర్‌కు?
చిన్నక్క :
నా పరిస్థితి ఫీజు ఇచ్చేటట్లు లేదయ్యా. అయినా, ఫీజు ఇచ్చేటట్లుంటే గా ప్రయివేటు దవాఖానాకే పోయేదాన్ని. స్థోమత లేకనే గీ సర్కారు దవాఖానకు వచ్చిన.
 
జీవన్‌రెడ్డి : రాత్రి పూట డాక్టర్లు ఉంటలేరని ఫిర్యాదు వచ్చింది. నిజమేనా మరి ?
ప్రమీల :
అవును సార్.. ఎప్పుడైనా సాయంత్రం పూట వస్తే డాక్టర్లు ఉంటలేరు. నర్సులే మందులు ఇచ్చి పంపిస్తున్నారు.
 
జీవన్‌రెడ్డి : మరి ఆస్పత్రిలో సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉన్నాయా?
ప్రమీల :
మాకైతే డాక్టర్ ఉండి మందులు రాసిస్తే చాలు, ఎక్స్‌రే, ల్యాబ్‌లైతే ఉన్నాయి. అవసరాన్ని బట్టి డాక్టర్లు చిట్టి రాస్తే ఆ టెస్టులు చేపించుకుంటం.
 
జీవన్‌రెడ్డి : గర్భవతులు ఆస్పత్రికి వచ్చినపుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?
సుగుణ :
ఇక్కడ గర్భిణులను పరీక్షించే గైనకాలజిస్టు లేదు. స్కానింగ్ మిషిన్ కూడా లేదంటున్నరు. చేసేది లేక గర్భిణులు ప్రయివేటు ఆస్పత్రులకు పోతాండ్రు.
 
జీవన్‌రెడ్డి : ఆప్‌కో క్యా తకిలీఫ్‌హై ? కిస్ వాస్తే దవాఖానాకో ఆయే?
నూర్జహాన్ బేగం :
సాబ్ మేరే కిడ్నీమే పత్తర్ ఆయే బోల్కె డాక్టర్ బోలే. హైదరాబాద్‌కో జాకే ఆపరేషన్ కరవాలో బోల్కె డాక్టర్ బోలే.. మగర్ హమ్ గరీబ్ లోగ్ హై సాబ్. ఇసీలియే హైదరాబాద్‌కో నహీ గయా. యహీపే ట్రీట్‌మెంట్ కర్వారహీ హూ.
 
జీవన్‌రెడ్డి : ఐసా కరేతో ఆప్‌కా తబియత్ ఖరాబ్ హోతేనా? ఆప్ ఏక్ కామ్ కరో, జిరాయత్ నగర్‌కా లీడర్ మాలిక్ బాబాసే మిలో ఉనో ఆప్‌కో ఆరోగ్యశ్రీ మే ఫ్రీమె ఆపరేషన్ కర్వాయేంగే.
నూర్జహాన్ బేగం :
షుక్రియా సాబ్
 
జీవన్‌రెడ్డి : డాక్టర్‌కు చూపించుకున్నవా అమ్మా? మందులు ఇచ్చారా?
అజీజ :
మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతు న్న. తప్పని పరిస్థితులలో డాక్టర్‌కు చూపించుకుందామని వచ్చిన. డాక్టర్ చూసి మందులు కూడా ఇచ్చిండు.
 
జీవన్‌రెడ్డి : తమ్ముడూ వికలాంగుడివైన నువ్వు ఎటు వచ్చావు?
శశిధర్ :
సార్ వికలాంగుల కోటాలో కోర్టులో ఉద్యోగం కోసం కాల్ లెటర్ వచ్చింది. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కోసం డాక్టర్ దగ్గరికి వచ్చిన. నాలాంటి వికలాంగునికి ఉద్యోగం ఇప్పిస్తే మీకు పుణ్యం వస్తుంది.
 
జీవన్‌రెడ్డి : ఏమైందమ్మా.? మీకెందుకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు?
అనాది :
జిరాయత్‌నగర్ కాలనీకి చెందిన మాకు వాంతులు, విరేచనాలు వచ్చాయి. అందుకే సర్కార్ దవాఖానాకు వచ్చినం. మా కాలనీకి చెందిన మరో ఇద్దరు కూడా వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిండ్రు.
 
జీవన్‌రెడ్డి : ఎందుకు ఒకటే కాలనీలో నుంచి ముగ్గురికి ఒకేసారి వాంతులు, విరేచనాలు అవుతున్నాయి.
అనాది :
డాక్టర్లు తాగే నీరు కలుషితం అయి ఉంటది. అందుకే ఇలా జరిగిందని చెప్పిండ్రు. మా ఇంటివాళ్లు మున్సిపాలిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసిండ్రు.
 
జీవన్‌రెడ్డి : ఏం తాత నువ్వేడికి వచ్చినవే?
నారాయణ :
వయసులో ఉన్నపుడు అన్ని పనులు చేసేవాడిని. ఇప్పుడు ఆరోగ్యం జర మంచి గుం టలేదు. అందుకే ఈడికి వచ్చిన. అయ్యా నువ్వే ఎట్లైనా చేసి నాకు పింఛన్ ఇప్పియ్యు కదా.. రోజులు గడవడం కష్టంగా ఉంది. ఇప్పుడు పని చేస్తే శరీరం కూడా సహకరించడం లేదు.
 
జీవన్‌రెడ్డి : ఎన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో అడ్మిట్ అయి ఉన్నావు?
షేక్ అమీరొద్దిన్ :
నిన్న సాయంత్రం గుండెలో నొప్పి వచ్చింది. డాక్టర్లు పరీక్షించి అడ్మిట్ చేసుకొని చికిత్స చేస్తున్నరు.
 
జీవన్‌రెడ్డి : ఆదివారం డాక్టర్లు అందుబాటులో ఉన్నది లేనిది నీకెట్లా తెలిసింది మరీ?
అల్మసొద్దిన్ :
మా ఇళ్లు ఆస్పత్రి పక్కనే ఉంది సార్. ఇక్కడ ఒక లాండ్ ఫోన్ ఉంటే రోగులు డాక్టర్ అందుబాటులో ఉన్నది లేనిదీ తెలుసుకోవచ్చు.
 
జీవన్‌రెడ్డి : అస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా?
అమీరున్నీసా, హెడ్ నర్సు :
తాగునీటి వసతి లేకపోవడంతో ఇన్ పేషంట్లకు ఇబ్బందికరంగా ఉంది. పేషంట్ల కుటుంబ సభ్యులు ఉండాలంటే సదుపాయాలు లేవు.
 
జీవన్‌రెడ్డి : మరి ఇట్లా ఆస్పత్రిలో జాయిన్ అయిన వారు తాగునీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు?
అమీరున్నీసా :
శాస్త్రీనగర్‌లో ఉన్న నల్లా నుంచి తా గునీటిని మోసుకుంటున్నరు. ఆస్పత్రి సిబ్బంది సై తం అక్కడి నుంచే నీళ్లు తెచ్చుకుంటారు.
 
జీవన్‌రెడ్డి : గర్భిణులు డెలివరీల కోసం ఈ ఆస్పత్రికి వస్తున్నారా?
వాణి :
ఆర్మూర్ టౌన్‌లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా ఉన్నయి. గర్భిణులను డెలివరీ కోసం ఇక్కడికి తీసుకురావడానికి సిబ్బంది కృషి చేస్తున్నరు. కానీ, ఇక్కడ  గైనకాలజిస్టు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది.
 
జీవన్‌రెడ్డి : మరి ఇక్కడ గర్భిణులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఎవరినైనా కోరారా?
వాణి :
ఏళ్ల తరబడి ఈ ఆస్పత్రిలో సౌకర్యాలు ఉండటం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కరించే వాళ్లే లేరు.
 
జీవన్‌రెడ్డి : ఈ పరిస్థితి మంచిది కాదు కదమ్మా మరి?
వాణి :
అవును సార్ మా లాంటి పేదోళ్లం ప్రాణభయంతో ప్రయివేటు ఆస్పత్రిలో ప్రతీ డెలివరీకి రూ. 20 వేల వరకు ఖర్చు చేస్తున్నాము. సర్కారోళ్లు మాకెందుకు ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించడం లే దో చెప్పాలి.
 
జీవన్‌రెడ్డి : ఆస్పత్రిలో అన్నిరకాల రోగుల కు మందులు అందుబాటులో ఉన్నాయా?
స్వరూప, ఫార్మసిస్టు :
సీజనల్ వ్యాధుల కు చికిత్స చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి.
 
జీవన్‌రెడ్డి : పాము కాటు, కుక్క కాటులాంటి ఎమర్జెన్సీ మందులు అందుబాటులో ఉన్నాయా?
స్వరూప :
పాముకాటు, కుక్కకాటు మం దులు సైతం అందుబాటులో ఉన్నాయి.
 
జీవన్‌రెడ్డి : మందులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నాయా.?
స్వరూప :
జిల్లా కేంద్రంలోని కార్యాలయం నుంచి మందులు తీసుకురావడం ఇబ్బందిగా ఉంది. కొన్ని మందులు ఫ్రిజ్‌లో నుంచి బయటికి తీస్తే చెడిపోయే ప్రమాదం ఉంది. మందులు తరలించడానికి ఫ్రిజ్‌తో కూడిన వాహనం ఉంటే బాగుంటుంది.
 
జీవన్‌రెడ్డి : ఆస్పత్రికి వైద్యులు సరిగా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నా యి.?
డాక్టర్ నాగరాజు :
విడతలవారీగా వైద్యులందరం డ్యూటీలు వేసుకొని రోగులకు అందుబాటులోనే ఉంటున్నాము. ఆదివారాలలో సైతం మేము డ్యూటీలు వేసుకుంటున్నం.
 
జీవన్‌రెడ్డి : డాక్టర్లందరూ స్థానికంగా నివాసం ఉంటున్నారా?
డా. నాగరాజు :
ప్రతీ డాక్టర్ స్థానికంగానే నివాసం ఉంటున్నారు. డ్యూటీ సమయం కాకున్నా రోగులకు అందుబాటులో ఉంటూ చికిత్స చేస్తున్నం.
 
జీవన్‌రెడ్డి : ఆస్పత్రిలో అంబులెన్స్ ఉందా?
డాక్టర్ నారాయణ :
అంబులెన్స్ అందుబాటులో లేదు. అత్యవసర సమయాలలో రోగులు ప్రయివేటు వాహనాలను మాట్లాడుఉంటున్నరు.
 
జీవన్‌రెడ్డి : ఆర్మూర్‌కు మంజూరైన వంద పడకల ఆస్పత్రితో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
డా. నారాయణ :
ఆర్మూర్‌లో వంద పడకల ఆస్పత్రి డిమాండ్ 25 సంవత్సరాలుగా ఉంది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే స్టాఫ్‌తోపాటు రోగులకు అవసరమైన సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి వైద్య సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకురావచ్చు.
 
జీవన్‌రెడ్డి : మరి ఈ వంద పడకల ఆస్పత్రిని ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది.?
డా. నారాయణ :
ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థానంలోనే వంద పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడితే బాగుం టుంది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
 
జీవన్‌రెడ్డి : జాతీయ రహదారులపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వంద పడకల ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు అవుతుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి మెరుగైన వైద్యసేవలందించడానికి ఉపయోగకరంగా ఉంటుంది కదా?
డా. నారాయణ :
ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా జాతీయ రహదారికి మూడు కిలో మీటర్ల లోపే ఉంది. కాబట్టి ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా ఇదే మంచి స్థలం. త్వరగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
 
జీవన్‌రెడ్డి ఏమన్నారంటే!

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఆర్మూర్‌కు వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంజూరు ఇప్పించాం. 20.79 కోట్ల రూపాయలతో త్వరలో దీనిని నిర్మిస్తాం. మండలంలోని గోవింద్‌పేటలో ఇప్పటికే పీహెచ్‌సీ భవన నిర్మాణం పూర్తయింది. త్వరలో దానిని కూడా ప్రారంభించి రోగులకు మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తెస్తాం. ఆర్మూర్ పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోగులకు కావాల్సిన సౌకర్యాలను తక్షణమే అందుబాటులోకి తెస్తాం.

వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి గైనకాలజిస్టును నియమించేలా చూస్తా. ఆస్పత్రిలో రోగులు తాగునీటికి ఇబ్బందులు పడకుం   డా తక్షణమే మున్సిపల్ ట్యాప్‌ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతీసింగ్‌కు సూచిస్తా. ఆస్పత్రిలో వీలైనంత త్వరగా ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టిస్తాం. సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే, తక్షణ మే పరిష్కరిస్తాం. వైద్యులు 24 గంటల పాలు రోగులకు అందుబాటులో రోగులకు సేవలందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement