పెరిగిన ఓటర్లు ఎటువైపు? | The Voter Turnout in The Constituency Has Increased in The Lok Sabha Polls as Compared to The Assembly Polls | Sakshi
Sakshi News home page

పెరిగిన ఓటర్లు ఎటువైపు?

Published Mon, Apr 1 2019 11:31 AM | Last Updated on Mon, Apr 1 2019 11:31 AM

The Voter Turnout in The Constituency Has Increased in The Lok Sabha Polls as Compared to The Assembly Polls - Sakshi

సాక్షి, సిర్పూర్‌(టి) : అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరగడంతో లోకసభ ఎన్నికల్లో ఓటర్ల ప్రభావంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గతంలో కంటే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం, అందులో యువత ఓటర్లే అధికంగా ఉండటంతో ప్రధాన పార్టీల నాయకులు పోలింగ్‌పై అంచనకు రాలేకపోతున్నారు. నియోజకవర్గంలోని సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూర్, కాగజ్‌నగర్, దహెగాం, పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి మండలాలు ఉన్నాయి.

7 మండలాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కంటే లోకసభ ఎన్నికలకు విడుదల చేసిన ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నియోజకవర్గంలోని 7 మండలాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 1,90,934 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం లోకసభ ఎన్నికలకు అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య 2,02,580 చేరుకుంది. అధికారులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో 11,646 మంది కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు.

పోలింగ్‌ శాతంపై అంచనాలు.. 
సిర్పూర్‌(టి) నియోజకవర్గంలోని మండలాల్లో ఓటర్ల సంఖ్య పెరగడంతో అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతం కంటే లోకసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరుగుతుందని నాయకులు అంచన వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు లేని పలువురు యువత కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. యువత ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉండటంతో, వారు ఎటువైపు మొగ్గుతారోనని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

పకడ్బందీగా ఏర్పాట్లు.. 
గ్రామాల్లో లోకసభ ఎన్నికలకు అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు, ఓటర్లకు మౌలిక వసతులు కల్పించడంలో నిమాగ్నమయ్యారు. అదేవిధంగా నియోజకవర్గంలో వందశాతం పోలింగ్‌ దిశగా పోలీసు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసు అధికారులు కవాతు నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒకరూ ఓటుహక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని భరోసా కల్పిస్తుస్తున్నారు.

పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు..
లోకసభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని రెండు అంతర్రాష్ట్ర రహదారులు సిర్పూర్‌(టి)–మాకిడి, వెంకట్రావ్‌పేట–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారుల్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు నిరంతరం వాహనాల తనిఖీ చేపడుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement