ఓరుగల్లు పోరులో.. విజేత ఎవరో!
► వరంగల్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
► మంగళవారం ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు
► మధ్యాహ్నానికి ఫలితం వెలువడే అవకాశం
వరంగల్: ఎంతో ఉత్కంఠ కలిగించిన వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల ఫలితం మంగళవారం వెలువడనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం మధ్యాహ్నానికి ఈ ఫలితం వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎంలను ఇప్పటికే వరంగల్ నగరానికి తరలించారు. నగరంలోని ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంల వారీగా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్లు లెక్కించడానికి 14 టేబుళ్లను ఏర్పాటుచేయగా మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
నియోజకవర్గంలో దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుత ఉపఎన్నికలో 69.01 శాతం ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఈ ఎన్నికలో మొత్తం 23 మంది పోటీలో నిలిచారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక ఓటర్లున్న వరంగల్ పశ్చిమ స్థానంలోనే (1.2 లక్షలు) అత్యల్పంగా (48.03 శాతం) పోలింగ్ నమోదైంది. మిగతా సెగ్మెంట్ల విషయానికొస్తే స్టేషన్ ఘన్‌పూర్ (74.55), పరకాల (76.69 శాతం), పాలకుర్తి (76.51 శాతం), వర్ధన్నపేట (74.03 శాతం), భూపాలపల్లి (70.1 శాతం) వరంగల్ తూర్పు (62.21 శాతం) పోలింగ్ నమోదైంది.