కాకతీయుల స్థావరాలు | WarangalTourism places In Dilapidation | Sakshi
Sakshi News home page

కాకతీయుల స్థావరాలు

Jul 17 2019 12:12 PM | Updated on Jul 17 2019 12:12 PM

WarangalTourism places In Dilapidation - Sakshi

సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గోడ

జయశంకర్‌ జిల్లా అటవీ సంపదకు పెట్టింది పేరు. జిల్లా విస్తీర్ణంలో ఎక్కువ భాగం అటవీ ప్రాంతమే ఉంది. ఈ అటవీ ప్రాతంలో ఆదిమానవులు, సమాధులు మొదలుకోని అనేక ఆలయాలు, గుహలు, రాతి చిత్రాలు ఉన్న ప్రాంతాలు, శత్రుదుర్బేధ్యమైన కోటలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. కొన్ని గతంలోనే వెలుగులోకి రాగా మరికొన్ని ఇటీవల కాలంలో బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇందులో ఒకటి కాపురం గుట్టల్లో ఉన్న సైనిక స్థావరాలు.
– మల్హర్‌

అల్లంత దూరాన దట్టమైన అడవి
మల్హర్‌ మండలంలో తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలో కాపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామ సరిహద్దులోని కాపురం చెరువు పరిసర ప్రాంతాలకు వెళ్తే అల్లంత దూరాన దట్టమైన అడవిలో మూడు కొండలు కనిపిస్తాయి. ఉలి పట్టుకుని శిల్పులు చెక్కారా అన్న తరహాలో ఈ కొండలు కనిపిస్తాయి. ఈ కొండలు కాకతీయుల కాలంలో సైనిక స్థావరాలుగా ఉపయోగించారనేందుకు అనేక ఆధారాలు లభించాయి. కొండ పైభాగంలో విష్ణుమూర్తి ఆలయంతో పాటు ఆలయ నిర్మాణంలో ఉపయోగించే పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గోడ, ఆ పక్కనే అనేక మానవ నిర్మిత గోడలు, బురుజులు, కొండ పైభాగంలో  కుంట పెంకులు, వాన నీటి నిల్వ కోసం బావులను పోలిన చెక్‌డ్యాంలను నేటికీ చూడొచ్చు. ఇక గుట్టల చుట్టూ ప్రహరీలు, సైనికులు నివాసం ఉండేందుకు అనుకూలంగా రెండు భారీ గుహాలు ఉన్నాయి. వీటన్నింటి ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కొండ పైభాగం నుంచి చూస్తే సుమారు 20 కిలోమీటర్ల దూరం వరకు పరిసర ప్రాంతాలు కనబడుతాయి. 

బావులు.. గుహలు
కొండలపై ఉండే సైనికుల దాహార్తి తీర్చేందుకు అనుకూలంగా రెండు చెక్‌ డ్యాంలను తలిపించే బావుల నిర్మాణాలు చేసుకున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడను కట్టి నీటిని నిల్వ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపుల రెండు గుహలు కనిపిస్తాయి. ఈ రెండు గుహల్లో 200 మంది వరకు ఉండేలా స్థలం కనిపిస్తుండడం విశేషం. సహజసిద్ధమైన రాతి గోడ మొదటి, రెండో కొండను కలుపుతూ సుమరు 500 మీటర్ల మేర సహజసిద్ధంగా ఉంటుంది. ఇది పెట్టని కోట వలె ఉండి శత్రు దుర్భేద్యమైన కోటగోడలా కనిపిస్తుంది.


శిథిలావస్థకు చేరిన ఆలయం   

చారిత్రక నేపథ్యం
కొండల నిర్మాణాలు పరిశీలించిన చర్రితకారుల కథనం ప్రకారం.. ఈ నిర్మాణం రెండో ప్రతాపరుద్రుడి కాలం నాటి రహస్య సైనిక స్థావరం కావొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతానికి పశ్చిమ దిక్కులో రామగిరి ఖిల్లా, తూర్పు దిక్కున ప్రతాపగిరి కోట ఉంది. క్రీ.శ. 1303 సంవత్సరంలో ఢిల్లీ పరిపాలకుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ సేనాని మాలిక్‌ కాఫర్‌ కాకతీయ రాజ్యంపై అంటే నేటి వరంగల్‌పై దండెత్తగా ఉప్పరపల్లి గ్రామం వద్ద సైనిక అధ్యక్షు పోతుగంటి మైలి తన సైన్యంతో ప్రతాపగిరి, రామగిరి ఖిల్లా నుంచి వచ్చిన సైన్యం సహకారంతో  మాలిక్‌కాఫర్‌ని మప్పు తిప్పలు పెట్టారు. కానీ ఢిల్లీ సైనికులకు బలం ఎక్కువగా ఉండటం మూలన ప్రతాపరుద్రుడు ఢిల్లీ సూల్తాన్‌కు ఏటా కప్పం కట్టేలా సంధి చేసుకున్నాడు. అనంతరం సైనిక కోటను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ రెండు సైనిక స్థావరాల వివరాలు శత్రువులకు తెలిసిపోవడంతో ప్రతాపరుద్రుడు ఇదే ప్రాంతంలోని కాపురంలో ఉన్న ఎత్తైన మూడు కొండల మీద సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశాడని స్థానికులు చెబుతుంటారు. 

కోట గోడలు 
శత్రువుల నుంచి రక్షణ కోసం రక్షణ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెలుగా ఈ భద్రత ఉండగా.. సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పట్టిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కాసేందుకు నలువైపులా బురుజు వంటి నిర్మాణాలు ఉన్నాయి. అలాగే కొండ పైభాగంలో ఒకటి, రెండో కోట గడీల మధ్య భాగంలో నీటి నిల్వ కోసం చెక్‌డ్యాం తరహాలో నిర్మాణం చేశారు. వర్షపు నీరు వృథా కాకుండా  కొండ పైభాగం నుంచి జాలు వారే నీటిని నిల్వ చేయడానికి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement