టీఆర్‌ఎస్‌కు మావోయిస్టుల హెచ్చరిక | A Warning Letter From the Maoist State Committee to the TRS Government | Sakshi
Sakshi News home page

నాయకులను లక్ష్యం చేస్తాం..

Published Wed, Jul 17 2019 9:54 AM | Last Updated on Wed, Jul 17 2019 9:55 AM

A Warning Letter From the Maoist State Committee to the TRS Government - Sakshi

సాక్షి,కొత్తగూడెం: చర్ల మండలంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే నల్లూరి శ్రీనివాసరావును హతమార్చామని, పోలీస్‌ ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ హెచ్చరించారు. శ్రీనివాసరావును ఎస్‌బీ పోలీసులు ఇన్ఫార్మర్‌గా మార్చుకుని దళాల సమాచారం సేకరించేవారని, అలాగే ఆదివాసీల 80 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసినం దునే చంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి హరితహారం పేరుతో అటవీశాఖ, పోలీసులతో పెద్ద ఎత్తున అటవీ భూములపై దాడులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లుగా కార్పొరేట్లు, భూస్వాముల కోసం సల్వాజుడం దాడులను కొనసాగిస్తున్నారన్నారు. కొమ్రం భీం జిల్లా కొత్త సార్సాల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు, చెలిమన్ననగర్‌ గ్రామాల్లో అటవీ శాఖాధి కారులు, పోలీసులు ఆదివాసీలకు జీవనాధారమైన భూముల్లో బలవంతంగా ట్రాక్టర్లతో దున్ను తూ మొక్కలు నాటుతూ ఆదివాసీలను గెంటివేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు దాడులకు దిగాల్సి వచ్చిందన్నారు.

దీనికి బాధ్యత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఇల్లెందు మండలం కోటగడ్డ, వీరాపురం, ముత్తారికట్ట, లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌రోడ్, దమ్మపేట మం డలం బాలరాజుగూడెం, ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి గ్రామాల్లో ఆదివాసీ రైతులను భూముల నుంచి గెంటివేస్తూ అటవీ అధికారులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా కందకాలు తవ్వి భూములను సాగు చేయకుండా ఆపారన్నారు. కేసీఆర్‌ పాలన మొదలైనప్పటి నుంచి అడవిలో ఆదివాసీలు ఉడతలు పట్టుకున్నా.. ఉడుములు పట్టుకున్నా వేల రూపాయల జరిమానా విధిస్తూ జైళ్లలో పెడుతున్నారన్నారు. మావోయిస్టు పార్టీ పాలకుల కుట్రలను, వాస్తవ విషయాలను ఆదివాసీలకు, పీడిత ప్రజలకు తెలియజేస్తూ ఉంటే తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం, పోలీసు అధికారులు ఆదివాసీలను మావోయిస్టు పార్టీ తప్పుదోవ పట్టిస్తున్న దని చెప్పడం దొంగే దొంగ అన్న చందంగా ఉంద న్నారు.

అనేక గ్రామాల్లో ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అక్రమంగా అరెస్టులు చేసి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేస్తున్నారని, మావోయిస్టు దళాలకు కొరియర్లుగా పనిచేస్తూ జెలిటిన్‌ స్టిక్స్, డిటోనేటర్లు, ఆహారం సప్లై చేస్తున్నారని   దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.  పోలీసులను చంపడానికి పెట్టిన బాంబులను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో అరెస్టులు చేస్తున్నట్లు మహబూబాబాద్, జయశంకర్, భద్రాద్రి జిల్లాల ఎస్పీలు బూటకపు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసు, అటవీ శాఖల అధికారులు హరితహారం పేరుతో దాడులను ఆపకపోతే, మావోయిస్టుల పేరుతో అక్రమ అరెస్టులను నిలిపి వేయకపోతే టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  అటవీ ప్రాంతంలో అధికంగా అడవులను నరికిన భూస్వాములు, రాజకీయ నాయకులు, పెత్తందారులు, ధనిక రైతుల చేతిలో ఎక్కువ భూములున్నాయన్నారు.  తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు కొనసాగించాలని జగన్‌ పిలుపునిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement