ఎల్లంపల్లి ప్రాజెక్టులో అడుగంటిన వరద నీరు, వరద నీటి మట్టం కొలత
సాక్షి, రామగుండం(కరీంనగర్): జూలైమాసం ఆరుద్ర కార్తె కొనసాగింపులో భారీవర్షాలతో చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండను తలపించారు. అయితే ఈ ఏడాది భిన్న వాతావరణం కనిపిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ప్రాజెక్టుల్లో వరద నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో గతేడాది ఇదే జూలై మాసం 13వ తేదీన(ఆరుద్ర కార్తె)లో 10.10 టీఎంసీల వరద నీరు ఉంది. ప్రస్తుతం 4.89 టీఎంసీల వరదనీరు ఉండడంతో నీటిపారుదలశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులో వరద నీటి మట్టం తగ్గిపోవడంతో ఇసుక తెప్పలతో ప్రాజెక్టు అందాలు కళవిహీనంగా మారాయి. ప్రాజెక్టు అవతలి వైపు మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చే మిషన్ భగీరథ పంపుహౌస్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. పంపుహౌస్ చుట్టూ ఇసుకతెప్పలు దర్శనమిస్తున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎల్లంపల్లి ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా ఖాళీ అయి ఉండడంతో వరదనీరు అందులోకి చేరుతోంది. దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో చుక్కనీరు రాకపోవడంతో వెలవెలబోతోంది.
గోదావరినదికి ప్రాణం పోస్తున్న ప్రాణహిత వరద నీరు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దశమార్చి వస్తున్న వరద నీటితో గోదావరిదిశ మారుతోంది. మహారాష్ట్ర గడ్చిరోలి నుంచి వస్తున్న ప్రాణహితనది నీరు కాళేశ్వరం గోదావరిలో కలుస్తోంది. ప్రాణహిత నది ఇన్‌ఫ్లో 12వేల క్యూసెక్కుల నీటి ప్రవహం ఉండడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీగా వరదనీరు చేరుతోంది. కాగా ప్రస్తుతం ప్రాణహిత ఇన్‌ఫ్లో 11వేల క్యూసెక్కులకు తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వరదనీటిని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి చేర్చి.. పంపుహౌజ్ వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే మంథనిలో గోదావరినది ప్రాణహిత నీటితో జలకళను సంతరించుకోవడంతో తొలి ఏకాదశి పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. అన్నారం పంపుహౌస్ నుంచి ఎత్తిపోసేందుకు మోటార్లకు సరిపడు వరద నీటి లభ్యతను బట్టి త్వరలోనే సుందిళ్ల బ్యారేజీలోకి మళ్లించి సుందిళ్ల (గోలివాడ) పంపుహౌజ్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పంపింగ్ చేయనుండడంతో గోదావరినదికి ప్రాణహిత ప్రాణం పోసినట్లవుతుందని స్పష్టంకానుంది. ఫలితంగా గోదావరినదిలో నీటి లభ్యత లేకపోయినప్పటికీ వృథాగా సముద్రం పాలవుతున్న ప్రాణహిత నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా సద్వినియోగం చేసుకోవడంతో ఎల్లంపల్లిలో జలక సంతరించుకోనుంది.
సుందిళ్ల పంపుహౌస్‌లో సిద్ధం చేస్తున్న మోటార్లు
ప్రాణహిత నీటిపంపింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో సుందిళ్ల (గోలివాడ) పంపుహౌస్ అధికారులు అప్రమత్తమయ్యారు. పంపుహౌస్‌లో తొమ్మిది మోటార్లకు గాను ఇప్పటికే ఏడు మోటార్లు సిద్ధం చేసిన అధికారులు ఈనెల చివరి కల్లా మరో రెండు మోటార్లు రన్ చేసే స్థాయికి తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల చివరి వరకు భారీ వర్షాలు కురిసి జలాశయాల్లోకి సరిపడు నీరు చేరితే రివర్స్ పంపింగ్ విధానంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద నీటిని మళ్లించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment