
రెండోపంటకు నీరివ్వాలి: జానా
ప్రజాసేవ మరిచి రాజకీయాలా అని ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి రెండో పంటకు నీరివ్వాలని సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం జానారెడ్డి మాట్లాడుతూ అయోమయంలో ఉన్న సాగర్ ఆయకట్టు రైతాంగానికి నీరిచ్చే విషయంలో వెంటనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలన్నారు.
మొదటిపంటకు నీరిచ్చే విషయంలోనే ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని విమర్శించారు. రెండో పంటకు నీరిచ్చే విషయంలోనూ గతంలో చేసిన పొరపాట్లు చేయవద్దని జానా కోరారు. ప్రజలు, రైతుల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. ప్రజా సేవను మరిచిపోయి రాజకీయాలకే పరిమితమైతే తగిన సమయంలో వారే బుద్ది చెప్తారని జానా రెడ్డి హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుని మార్పు ఉంటుందా అని విలేకరులు ప్రశ్నిస్తే అది తన స్థాయి కాదని, తనను అలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ విలేకరులపై జానా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తున్నదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సాగర్ రెండో పంటకు నీరిచ్చే విషయంలో ఇంకా జాప్యం చేస్తూ రైతాంగాన్ని అయోమయంలోకి నెడుతోందన్నారు.