
రెండో ప్రాధాన్యత ఓటు అనవసరం
ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎల్పీ సమావేశంలో నిర్ణయం
ఉత్తమ్, జానాకు బాధ్యతల అప్పగింత
ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏం చేయాలన్న దానిపై చర్చ
హైదరాబాద్: శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. ఈ అంశంపై చర్చించడానికి మంగళవారం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్.సి.కుంతియా సమక్షంలో ఈ సమావేశం జరిగింది. రెండో ప్రాధాన్యతా ఓటు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీసుకోవాల్సిన చర్యలు, ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి వంటి వాటిపై చర్చ జరిగింది. రెండో ప్రాధాన్యతా ఓటును వేద్దామా, వద్దా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సభ్యుల బలంతో మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే గెలుస్తామని, రెండో ప్రాధాన్యతా ఓటును వేయాల్సిన అవసరం లేదని సీనియర్లు అభిప్రాయపడినట్టుగా సమాచారం. రాష్ట్రంలో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ను ఓడించాలని, కేంద్రంలో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బీజేపీతో జతకట్టిన టీడీపీతోనూ అంతే దూరం పాటించాలని ఈ సమావేశంలో మాట్లాడిన సీని యర్లు గట్టిగా సూచించారు. రెండో ప్రాధాన్యత ఓటును వినియోగించుకోవాల్సిన అవసరమే లేదని స్థూలంగా నిర్ణయించారు. అలాగే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు విప్‌ను జారీచేయొచ్చా, విప్ ఉల్లంఘిస్తే అనర్హతవేటుకు అవకాశముందా అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై నిపుణులతో చర్చించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల పూర్తి బాధ్యతను ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డికి ఈ సమావేశం అప్పగించింది. ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిపై జరిగిన దాడిపైనా చర్చించి, గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. సమావేశానికి ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, పువ్వాడ అజయ్, జె.గీతారెడ్డి, వంశీచంద్ రెడ్డి హాజరు కాలేదు.
అధికార పార్టీకి బుద్ధ్ది చెబుతాం : సంపత్
అధికార పార్టీకి బుద్ధి చెబుతామని కాంగ్రెస్ పార్టీ విప్ సంపత్‌కుమార్ అన్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తమకు వ్యూహం ఉందన్నారు. ఎమ్మెల్యేల బలం లేకున్నా ఐదో అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా అధికార పార్టీయే అనైతిక కార్యకలాపాలకు దిగిందని విమర్శించారు.
జూన్ 2న సోనియాకు కృతజ్ఞతా దినోత్సవం
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రచారం: ఉత్తమ్
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన జూన్ 2ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతా దినోత్సవంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాలను జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా, మండల స్థాయిల్లో పతాకావిష్కరణలు చేయాలని సూచించారు. రాష్ర్ట ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైన విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలపై జూన్ 3న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్వహించిన పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.