‘సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదు’
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్‌వీ చంద్రవదన్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో చట్టానికి లోబడి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 27 మందికి నోటీసులిచ్చామని, 19 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. నోటీసులు ఇచ్చినవారిలో 12 మంది సినిమా ప్రముఖులు ఉన్నారని, వీరిలో ఇప్పటివరకు ఐదుగురు ప్రశ్నించినట్టు తెలిపారు. దర్యాప్తు ఆగస్టు 2 వరకు కొనసాగుతుందని, చట్టానికి లోబడి విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశామనడం కరెక్ట్ కాదని, న్యాయపరంగా ముందుకు వెళుతున్నామన్నారు. కేసు దర్యాప్తుపై కొంత మందికి కోర్టును వెళ్లారని, తాము కూడా న్యాయస్థానానికి సమాధానం ఇస్తామని చెప్పారు. న్యాయపరమైన సలహాలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నిందితుల నుంచి బలవంతంగా శాంపిల్స్ తీసుకోవడం లేదని, దౌర్జన్యం చేయడం లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి పనిచేస్తున్నామన్నారు. రక్త నమూనాలు ఇచ్చిన వారు భయపడాల్సిన పనిలేదన్నారు. పూర్తి నిబద్ధత, చట్టప్రకారం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చంద్రవదన్ ప్రకటించారు.