మాకొద్దీ ఉచిత విద్య! | We do not want Free education | Sakshi
Sakshi News home page

మాకొద్దీ ఉచిత విద్య!

Published Sun, Jul 28 2019 2:25 AM | Last Updated on Sun, Jul 28 2019 2:25 AM

We do not want Free education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఊడ్చేందుకు చీపుర్లు లేవు. టాయిలెట్లు శుభ్రం చేసేవాళ్లు లేరు. చాక్‌పీసులకు పైసల్లేవ్‌. డస్టర్లకు డబ్బుల్లేవ్‌. టీచింగ్‌ డైరీల్లేవు. ఇందుకు ఏకైక కారణం కాలేజీలో డబ్బుల్లేకపోవడమే. 

ఈ దుస్థితి ఆ ఒక్క కాలేజీకే పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశ పెట్టిన ‘ఉచిత విద్య’కారణంగా విద్యార్థుల నుంచి పైసా వసూలు చేయడానికి వీల్లేదు. కాలేజీలకు డబ్బులు ఇప్పిస్తామన్న ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. ఫీజులు వసూలు చేయనపుడు రీయింబర్స్‌ ఎలా చేస్తామని సంక్షేమ శాఖలు చేతులెత్తేశాయి. దీంతో ఏం చేయాలో అర్థంకాక ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు.

ప్రిన్సిపాళ్ల ఆందోళన
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల నిర్వహణలో ప్రిన్సిపాళ్లు తంటాలు పడుతున్నారు. చాక్‌పీసులకు నిధుల్లేక అల్లాడుతున్నారు. కాలేజీల ఆవరణ, ప్రిన్సిపాల్, సిబ్బంది గదులు, తరగతి గదులను ఊడ్చే దిక్కులేదు. కాలేజీల్లో టాయిలెట్లను శుభ్రం చేయించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆందోళనకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల సమావేశమై తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కాలేజీలను తాము నిర్వహించలేమంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అంతా ఉచిత విద్య చలవే!
నాలుగేళ్ల కిందట జూనియర్‌ కాలేజీల్లో ఉచిత విద్యను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో 2016–17 విద్యా సంవత్సరం నుంచి ఆయా కాలేజీల్లో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంలేదు. అప్పట్లో ఉన్న 402 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,15,111 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు అయినందునా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు ప్రతి విద్యార్థి నుంచి సైన్స్‌ విద్యార్థులైతే రూ.893, ఆర్ట్స్‌ విద్యార్థులైతే రూ.533 కాలేజీలు వసూలు చేసేవి. అయితే 2016 జనవరి 7వ తేదీన జారీ చేసిన జీవో 2లో ఆ మొత్తాన్ని కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేసింది.

సంక్షేమ శాఖలు ఇవ్వాలని చెప్పినా
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ ఉచిత విద్య కారణంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 404 జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు చేరింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం కాలేజీలు విద్యార్థుల నుంచి స్పెషల్‌ ఫీజులను వసూలు చేయవద్దని, కాలేజీలు తమ ఖర్చులను కంటింజెన్సీ ని«ధులతోపాటు సంక్షేమ శాఖలు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా వెళ్లదీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పైగా ఆర్థిక శాఖ, సంక్షేమ శాఖలతో సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ జీవోలో పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ప్రభుత్వం ఒక్కో కాలేజీకి ఇస్తున్న కంటింజెన్సీ నిధులు ఒకనెల ఎలక్ట్రిసిటీ బిల్లుకు కూడా సరిపోవడం లేదని ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. మరోవైపు సంక్షేమ శాఖలు చేతులెత్తేశాయి. కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయనపుడు తాము ఎందుకు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని మెలిక పెట్టాయి. దీంతో విద్యార్థుల నుంచి స్పెషల్‌ పీజుల రూపంలో వచ్చే మొత్తం రాకపోగా, సంక్షేమ శాఖలు కూడా ఇవ్వక కాలేజీల నిర్వహణ కష్టంగా మారిపోయింది.

ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చినా
ఉచిత ఇంటర్మీడియట్‌ విద్యాపథకం ప్రవేశ పెట్టడానికి ముందు విద్యార్థుల నుంచి స్పెషల్‌ ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బు కాలేజీల అకౌంట్లలో ఉన్నాయి. దీంతో ఇన్నాళ్లు సంక్షేమ శాఖలు డబ్బులు ఇవ్వకపోయినా ఆ నిధులతో ప్రిన్సిపాళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు తాము తాము నిర్వహించలేమంటూ చేతులెత్తేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయా కాలేజీల్లోని నిధులు అయిపోయి, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ నుంచి పైసా రాక పోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో 100 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. 1500 మంది, 2 వేల మంది విద్యార్థులు ఉన్న కాలేజీలూ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2 లక్షల మంది విద్యార్థులున్నారు. 300 మంది విద్యార్థులు ఉన్న కాలేజీని తీసుకుంటే.. ఏటా (కాలేజీ నడిచే 10 నెలలకు)వెచ్చించాల్సిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి. రూ.20వేలు అటెండర్‌కు, రూ.20వేలు స్వీపర్‌కు, రూ. 20వేలు బాత్రూమ్‌లు కడిగేవారికి, రూ. 20వేలు నైట్‌ వాచ్‌మెన్‌కు, రూ.20వేలు కరెంటు బిల్లు (కంప్యూటర్లు, ఆర్‌వో ప్లాంటు ఉన్న కాలేజీల్లో నెలకు 2 వేల చొప్పున)కు, రూ.10వేలు చాక్‌ పీసులు, డస్టర్లు, రిజిసర్టర్లకు, రూ.5వేలు ఇంటర్నెట్‌ ఛార్జీలు, రూ.20వేలు కార్యక్రమా లకు ( జూన్‌ 2, ఆగస్టు 15, జనవరి 26, కాలేజ్‌ డేలకు అథమంగా రూ.5 వేల చొప్పున వెచ్చిస్తేనే. కానీ ఒక్కో ఫంక్షన్‌ చేస్తే రూ.10 వేలకు పైనే అవుతుంది) ఖర్చవుతోంది. 

ఏటా కనీసం రూ.1.25 లక్షలు
ఇలా కనీసంగా లెక్కలేసుకున్నా ఒక్కో కాలేజీ నిర్వహణకు హీనపక్షంలో ఏటా రూ.1.25లక్షలు అవసరం. కానీ రాష్ట్రంలో 500 నుంచి మొదలుకొని 2వేల వరకు విద్యార్థులున్న కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. వీటి అవసరాలకోసం కోసం కనీసం రూ.1.5లక్షల నుంచి 2లక్షల వరకు వెచ్చించాల్సిందే. అయినా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ పైసా ఇవ్వడం లేదు. కంటింజెన్సీ కింద ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్‌ బిల్లులు ఒక నెలకు కూడా సరిపోవడం లేదు. సంక్షేమ శాఖలు ఇస్తాయన్న నిధులను రాకపోవడంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఆర్థిక కష్టాల్లో పడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement