సాయిబాబాకు జీవితఖైదు.. హైకోర్టులో సవాల్!
- గడ్చిరోలి కోర్టు తీర్పుపై
- ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని భార్య ప్రకటన
హైదరాబాద్: ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు జీవితఖైదు విధిస్తూ గడ్చిరోలి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన భార్య వసంత తెలిపారు. విచారణ సందర్భంగా తమ వాదనలను కిందికోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అన్నారు. తీర్పును చూస్తే.. న్యాయవ్యవస్థపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చింది. ప్రొఫెసర్ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్థారణకు వచ్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయిబాబాతో పాటు మహేష్ తిక్రి, పాండు నరోటీ, విజయ్ టిక్రి, జేఎన్‌యూ విద్యార్థులు హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ రాహితోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యం పాలుకావటంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, సాయిబాబాపై ఆరోపణలపై గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది.