‘కొత్త పార్టీతో సీఎం కేసీఆర్‌కు చెక్ పెడతా’
నకిరేకల్ (నల్గొండ జిల్లా): తెలంగాణ ఇంటి పార్టీతో సీఎం కేసీఆర్‌కు చెక్ పెడతామని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఉద్యమకారులను టీఆర్‌ఎస్ నుంచి గెంటివేసి ద్రోహులను పార్టీలో చేర్చుకుని ప్రజలకు మాయమాటలు చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని తెలంగాణ ఉద్యమ వేదిక పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భావ సభతో ఉద్యమ బాహుబలి సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.
నాడు సీమాంధ్ర పాలకులపై సాగించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమ సామాజిక శక్తులకు అధికారం వచ్చేంత వరకు పోరు సాగిస్తామని స్పష్టం చేశారు. 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో పని చేసిన కార్యకర్తలు, నాయకులకు తెలంగాణ ఇంటి పార్టీలో సముచిత గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ బానిసత్వంలో, భ్రమల్లో బతకడం కంటే స్వేచ్ఛగా పోరాడగలిగే తెలంగాణ ఇంటి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభకు కవులు, కళాకారులు, మేధావులు, కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉద్యమ వేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యురాలు చెరుకు లక్ష్మి, బొల్లెపల్లి అంజయ్య, తదితరులు ఉన్నారు.