'రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి పెంచితే సమ్మె చేస్తాం'
హైదరాబాద్‌సిటీ: రెవెన్యూ ఉద్యోగులపై ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా వారు మానసికంగా ఆందోళన చెందుతున్నారని తెలంగాణ తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ అన్నారు. ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాల్సిందిగా కోరుతూ తహసీల్దార్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, వి.నరేందర్‌ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామన్నారు.
ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... గతేడాది జరిగిన ఎన్నికల నాటి నుంచి రెవెన్యూ సిబ్బందిపై అదనపు పనిభారం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూఎల్‌సీ భూముల గుర్తింపు, సమగ్ర కుటుంబ సర్వే, పెన్షన్‌ల ప్రక్రియ, క్రమబద్ధీకరణ వంటి కార్యక్రమాలను తాము స్వాగతిస్తున్నప్పటికీ, పనిభారాన్ని తగ్గించేలా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది పూర్తిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలో బిజీగా ఉండటంతో సాధారణ పౌరసేవలు దాదాపుగా స్తంభించాయని రామకృష్ణ అన్నారు. దీంతో పలు మండలాల్లో పౌరులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారన్నారు. రెవెన్యూ సిబ్బంది సమస్యలను గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే తాము సమ్మె బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
(కంటోన్మెంట్)