ఆదిలాబాద్‌లోని వెల్‌నెస్ సెంటర్
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌లో సేవలు కొరవడుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌కార్డు ద్వారా వైద్య సేవలు పొందేం దుకు ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట ‘వెల్‌నెస్’ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తుంది. అయినా నేటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో పాటు పరికరాలు కూడా లేకపోవడంతో వైద్య సేవలు నామమాత్రంగానే అందుతున్నాయి. చిన్ని చిన్న జబ్బులకు వైద్యం చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల్లో వెల్‌నెస్ కేంద్రాలు ఏడాది క్రితమే ఏర్పడి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాయి. కాని ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. అధికారులు అలసత్వం వహించడంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
పోస్టుల భర్తీ ఎప్పుడో.!
ఎంప్లాయీ, పెన్షనర్స్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ (వెల్‌నెస్) సెంటర్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా హెల్త్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కాని జిల్లాలో మాత్రం అవి పనికిరాకుండానే పోతున్నాయని కొంతమంది ఉద్యోగులు పేర్కొంటున్నారు. బీపీ, షుగర్, జ్వరం, తదితర చిన్న చిన్న జబ్బులకు మందులు ఇవ్వడం తప్పా నాణ్యమైన వైద్య సేవలు లభించడంలేదు.
ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులు ఉండాల్సిన చోట కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు బీడీఎస్ వైద్యులకు గానూ ఒకరు, ఇద్దరు ఫిజియోథెరపిస్టులు పనిచేస్తున్నారు. ముగ్గురు ఫార్మాసిస్టులు విధులు చేపడుతున్నారు. ఒక అల్ట్రాసౌండ్ టెక్నీషియన్, ముగ్గురు స్టాఫ్ నర్సులకు గానూ ఇద్దరే పనిచేస్తున్నారు. నలుగురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండాల్సి ఉంది. కాని ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. వారికి పరీక్ష నిర్వహించినప్పటికీ నియమాకాల్లో అంతులేని జాప్యం జరుగుతుంది.
జాడలేని పరికరాలు..
వెల్‌నెస్ సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి వైద్య పరికరాలకు కూడా నోచుకోకుండా పోయింది. నియమించిన కొద్దిమంది సిబ్బంది పరికరాలు లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఈ కేంద్రం ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, సెలవు దినాల్లో, ఆదివారం 9 నుంచి ఒంటిగంట వరకు పనిచేయాల్సి ఉంది. ఓపీ సేవలు మాత్రమే అందిస్తారు. అల్ట్రాసౌండ్ టెక్నీషియన్ ఉన్నప్పటికి స్కానింగ్ మిషన్ లేదు. ఫిజియోథెరఫిస్టులు ఉన్నప్పటికీ పరికరాలు లేకుండా పోయాయి. డెంటల్‌కు సంబంధించి వైద్యులు ఉన్నప్పటికీ కుర్చీలు తప్పా మరే పరికరం లేదు. ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించినప్పటికీ పరికరాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసి తీసుకొస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కేవలం 50శాతం వరకు మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, జర్నలిస్టులకు ఏ స్థాయిలో వైద్యం అందుతుందో ఇట్టే అర్థమవుతోంది.
స్పెషలిస్టులేరీ..
ప్రస్తుత కాలంలో వివిధ జబ్బులతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు సతమతమవుతున్నారు. సంబంధిత జబ్బులకు వైద్య సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ పరికరాలు, సిబ్బంది కొరత కారణంగా వైద్యం అందని ద్రాక్షగానే మారింది. ఒక్క ఎంబీబీఎస్ వైద్యుడిని మాత్రమే నియమించారు. గైనకాలజిస్టులు, ఫిజీషియన్, అర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ఆప్తాలమిస్ట్, పిల్ల ల వైద్య నిపుణులు, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, తదితర పోస్టులను భర్తీ చేస్తే తప్పా ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరేలా కనిపించడం లేదని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. వైద్యం కోసం ఒకసారి ఆ కేంద్రానికి వెళ్లిన వారు మరోసారి వెళ్లేందుకు జంకుతున్నారు.
జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి వెల్‌నెస్ కేంద్రంలో వైద్య పరికరాలతో పాటు సరిపడా సిబ్బందిని నియమించాలని ఉద్యోగులు, జర్నలిస్టులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment