ఆలేరులో జాతీయ రహదారి పక్కన మాంసాన్ని విక్రయిస్తున్న దుకాణదారులు
సాక్షి, ఆలేరు : ఆలేరులో మాంసాహర విక్రయాలపై అధికారుల నియంత్రణ కొరవడింది. గ్రామ పంచాయతీ, పశువైధ్యాధికారుల అనుమతి లేకుండానే మేకలు, గొర్రెలను వధిస్తున్నారు. మూగ జీవాలను కోసే ముందు సంబంధిత అధికారులు ఆమోద ముద్ర వేయాలి. ఆరోగ్యం ఉందని సర్టిఫై చేసిన తరువాతనే వధించాల్సి ఉంటుంది. అలాగే మాంసం కోసే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇవేమీ పట్టడం లేదు. ఆరోగ్యంగా లేని మేకలను, గొర్రెలను ఇండ్ల వద్ద వధిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మటన్‌ధర ప్రస్తుతం కేజీకి 550 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కొందరు పొట్టేలు మాంసానికి బదులు మేక, గొర్రె మాంసాన్ని అంటగడుతున్నారని పలువురు వాపోతున్నారు.
నిబంధనలు గాలికి..
మటన్ షాపులు రహదారి పక్కన మురికి కాల్వ పక్కన విక్రయిస్తున్నారు. మాంసం పై దుమ్ము ధూళి, ఈగలు వాలుతున్నాయి. మాంసాన్ని అమ్మే షాపులు పరిశుభ్రంగా ఉండాలి. నిల్వ చేసిన మాంసాన్ని అమ్మకూడదు. ఆహార పదార్థాలు..ప్రధానంగా మాంసాన్ని విక్రయించే షాపులకు అనుమతి ఉండాలి. మేకలను, గొర్రెలను వధించినప్పుడు వెలువడే వ్యర్థాలను నిర్ధేశిత ప్రాంతాలకు తరలించాలి.
ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు..
మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచకుండా కొన్ని గంటల పాటు వేలాడదీస్తే వ్యాధి కారక క్రిములు చేరుతాయి. ఈ మాంసాన్ని తింటే అమీబియాసిస్, విరేచనాలు, ఈకొలై వల్ల సంక్రమించే వ్యాధులు సంభవిస్తాయి. ఈగలు ముసిరిన మాంసాన్ని తింటే టైపాయిడ్, గ్యాస్ట్రో, ఎంటరైటిన్ వ్యాధులు వస్తాయి. వీటితో పాటు విరేచనాలు అవుతాయి.
అసంపూర్తిగా మడిగెలు..
మటన్ షాపుల నిర్వహణ కోసం ఆలేరు పట్టణంలో సుమారు 15సంవత్సరాల క్రితం మడిగెలు నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. వీటిని ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం అసంపూర్తి మడిగెల్లో కంపచెట్లు పెరిగి, మూత్రశాలగా మారింది. వీటిని పూర్తి స్థాయిలో నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment