సమగ్ర కుటుంబ సర్వేలో ఏముంది? | What's comprehensive family survey? | Sakshi
Sakshi News home page

సమగ్ర కుటుంబ సర్వేలో ఏముంది?

Published Mon, Aug 18 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

సమగ్ర కుటుంబ సర్వేలో  ఏముంది?

సమగ్ర కుటుంబ సర్వేలో ఏముంది?

సర్వే అధికారులకు ఈ రుజువులు చూపండి
 సర్వే కోసం 19న ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు కుటుంబానికి సంబంధించిన వాస్తవ వివరాలు తెలియజేయడంతో పాటు వారి అనుమానాల నివృత్తికి అందుబాటులో ఉన్న కొన్ని రుజువులు చూపాల్సి ఉంటుంది.

సర్వే సమయంలో ఉన్న చిరునామా కాకుండా ఇతర ప్రాంతాల చిరునామాలతో ఆ పత్రాలు ఉన్నప్పటికీ అవసరం మేరకు చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గత సంవత్సరం అద్దె ఇంట్లో ఉండి అదే ఇంటి నంబరుతో ఆధార్‌కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు పొంది ఉన్న వారు తరువాత వేరే ఇంట్లోకి మారినట్లయితే ప్రస్తుతం ఉన్న చిరునామా చెప్పడంతో పాటు పాత చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు నంబరు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పవచ్చు.  

సర్వే అధికారులు అడిగితే చూపించాల్సిన మరికొన్ని పత్రాలు...
     ఆధార్ కార్డు
     వాహన రిజిస్ట్రేషన్ కార్డు
     ఇంటి అసెస్‌మెంట్, ఇంటి పన్ను రశీదు
     కరెంట్ బిల్లు
     ఎల్పీజీ కనెక్షన్ పుస్తకం
     బ్యాంక్, పోస్టాఫీసు పాసు పుస్తకం
     కులం, జనన ధ్రువీకరణ పత్రం
     విద్యార్థులు చదువుకున్న పత్రాలు(మెమో, టీసీ వంటివి)
     వికలాంగుల ధ్రువీకరణ పత్రం(సదరం సర్టిఫికెట్)
     వాహనాల రిజిస్ట్రేషన్ కాపీ కార్డు
     వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం
     ఓటర్ ఐడీకార్డు, పాన్‌కార్డు

     ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందితే ఇందిరమ్మ ఇల్లు, వంటి వాటి కేటాయింపు సర్టిఫికెట్. పెన్షనర్ల ఐడీ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.
 
 రేషన్‌కార్డు ప్రస్తావన లేదు

 ప్రభుత్వం బేస్‌లైన్ సర్వే చేపడుతుందనగానే రేషన్‌కార్డుల ఏరివేత కోసమే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అయితే నిజానికి సర్వేలో ఎక్కడా రేషన్‌కార్డుకు సంబంధించిన వివరాలు అడగడం లేదు. బోగస్‌కార్డుల ఏరివేతకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, సర్వేతో రేషన్‌కార్డుకు ఎలాంటి సంబం ధం లేదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే బోగస్ కార్డులు ఉన్న వారు స్వచ్ఛందంగా వాటిని అధికారులకు అందజేయాలని కోరారు. లేదంటే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్డుల ఏరివేత చేపట్టి అనర్హులుగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

 ఇంటికి నంబర్.. ప్రభుత్వ స్టిక్కర్
 ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేస్‌లైన్ ఇంటింటి సర్వేలో ఏ ఒక్క కుటుంబం, ఇల్లు తప్పిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. సర్వే కోసం వెళ్లిన ప్రతీ ఇంట్లో సర్వే పూర్తికాగానే ఆ ఇంటికి ప్రభుత్వ చిహ్నంతో ఒక స్టిక్కర్ అతికించడంతో పాటు సర్వే సందర్భంగా కేటాయించే నంబరును గోడపై రాస్తారు. ప్రస్తుతం సర్వే ఫారంలో కేటాయించిన నంబరు ఆ కుటుంబానికి సంబంధించి శాశ్వత నంబరుగా(యూనిక్ నంబరు) కేటాయిస్తారు.

 మరిన్ని విషయాలు..
 ఇంటివద్దే ఉండాలి : సర్వే రోజు కుటుంబ యజమాని సహా సభ్యులందరూ.. ఇంటివద్దనే అందుబాటులో ఉండి అధికారులకు పూర్తిసమాచారం అందజేసి సహకరించాలి. అవసరమైన వాటి కోసం సంబంధిత రుజువు పత్రాలు చూపిస్తే సరిపోతుంది. స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉంటే ఆ వివరాలు కూడా సర్వేలో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 ఇంటి వద్ద లేనివారి కోసం :  ఆస్పత్రుల్లోని ఇన్‌పేషెంట్‌లు, వారి సహాయకులు, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సర్వేలో మినహయింపు ఇచ్చారు. వారి వివరాలు కుటుంబ సభ్యులు నమోదు చేయించవచ్చు. అయితే స్థానికంగా లేని వారికి సంబంధించిన రుజువులు చూపాలి. ఉదాహరణకు ఆస్పత్రిలో చేరిన కార్డు, హాస్టల్, కళాశాల అడ్మిషన్ కార్డు వంటివి చూపించాలి.

 రెండు కుటుంబాలు ఉంటే :  ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని ఫారాలు విడిగా పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటున్నట్లయితే వారికి సంబంధించి రెండు ఫారాలు విడివిడిగా నమోదు చేసి, ఆ కుటుంబాలకు విడివిడిగా నంబర్లు కేటాయిస్తారు.

 సొంత ఇంట్లో అయితే మంచిది : ప్రజలు సాధ్యమైనంత వరకు తమ సొంత గ్రామాల్లోనే వివరాలు నమోదు చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. సర్వే సందర్భంగా అధికారులకు ఇచ్చే ఆధార్, ఇతర వివరాలు వేరే చిరునామాతో నమోదు చేసుకున్నవైనా ఇబ్బంది లేదంటున్నారు. ఆ రోజున ప్రభుత్వం సెలవు దినంగా కూడ ప్రకటించినందున సాధ్యమైనంత వరకు స్వగ్రామాల్లోని సొంత ఇంట్లోనే నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

 విభాగం-ఎ- గుర్తింపు వివరాలు
 ముందుగా ఎన్‌రోల్ మొంట్ బ్లాక్ నంబరు, నామమాత్రపు ఇంటి నంబరు, సర్వే ఫార్మాట్ నంబర్, జిల్లా పేరు, రెవెన్యూ గ్రామం, గ్రామ పంచాయతీ పేరు, మండలం, మునిసిపాలిటీ, ఆవాసం, వార్డు, డివిజన్ ఇంటి నంబరు, నివసిస్తున్న ప్రదేశం, వాడపేరు, కాలనీపేరు, ఇంటిలో ఉన్న కుటుంబాల సంఖ్య నమోదు చేసుకుంటారు.

  విభాగం-బి- కుటుంబం వివరాలు
 ఇందులో కుటుంబ యజమాని పేరు, ఇంటిపేరు, పూర్తి పేరు,  తల్లి/తండ్రి/భర్త పేరు, కుటుంబంలోని సభ్యుల సంఖ్య, మతం, సామాజిక వర్గం, కులం, మాతృభాష, వంటగ్యాస్ కనెక్షన్ (ఉంది/లేదు), గ్యాస్ కంపెనీ పేరు, వినియోగదారుడి సంఖ్య, మొబైల్ ఫోన్ నంబరు, ఆదాయ పన్ను చెల్లించే కుటుంబమా(అవును/కాదు).

 అనాథలు ఉంటే వారి వివరాలు..
 అనాథలు ఎక్కడ నివసిస్తున్నారు, అనాథ స్థితి, సంచార కుటుంబాలు, జాతులవారు అయితే వారికి శాశ్వత నివాసం వేరేచోట ఉందా(ఉంది/లేదు), గ్రామం, మండలం, జిల్లా పేరు, ఎంతకాలం నుంచి ప్రస్తుత చిరునామాలో ఉంటున్నారు.

 విభాగం-సి- నివాస స్థితి
 నివాస స్థితిలో ఇంటికప్పు రకం, గదుల సంఖ్య(వంటగది కాకుండా), ఇంకా ఎక్కడైనా ఇల్లు ఉందా( ఉంది/లేదు), ఇంటి స్థలం ఎక్కడైనా ఉందా( ఉంది/లేదు), ప్రభుత్వ గృహ నిర్మాణ కార్యక్రమంలో లబ్ధిపొందారా(అవును/కాదు), ఇంటి నిర్మాణం జరిగిన సంవత్సరం, ఇంటికి మరుగుదొడ్డి, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సదుపాయం ఉందా..? విద్యుత్ మీటరు నంబరు.

 విభాగం-డి - కుటుంబ సభ్యుల వివరాలు
 ఈ విభాగంలో కుటుంబ యజమాని మొదలుకుని కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తారు. యజమాని పేరు, సభ్యుల పేర్లు, యజమానితో గల సంబంధం, లింగము, పుట్టిన తేదీ, వయసు, వైవాహిక స్థితి, విద్యార్హతలు, విద్యార్థులైతే చదువు వివరాలు, బ్యాంక్, పోస్టాఫీస్ అకౌంట్, శాఖ పేరు, బ్యాంక్, బ్రాంచ్ పేరు, ఉద్యోగం(ఉన్నది/లేదు), ఉద్యోగం రకం, ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్‌దారు, సామాజిక పింఛన్ దారు, ప్రధానమైన వృత్తి, మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉందా.. ఆధార్ కార్డు ఐడీ నంబరు వంటి  వివరాలు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

 విభాగం- ఇ - వికలాంగుల వివరాలు
 ఇందులో వికలాంగుల పేరు, ఎలాంటి వైకల్యం ఉంది. సదరం సర్టిఫికెట్ ఉందా(ఉంది/లేదు), ఉన్నట్లయితే ఐడీ నంబరు, వైకల్య శాతం వంటి వివరాలు సర్వే అధికారులకు చెప్పాలి.

 విభాగం - ఎఫ్‌లో..
 ఈ విభాగంలో కుటుంబంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పేరు, వ్యాధిరకం వంటి వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

 ఈ వివరాలు చెబితే సరి
    ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల వివరాలు
     కులం
     కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డుల వివరాలు, నంబరు
      వంటగ్యాస్ కనెక్షన్ వివరాలు
     మొబైల్ నంబరు
      చదువుకున్న వారైతే వయసు ధ్రువీకరణ పత్రం
     బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా నంబర్లు
      ఉద్యోగులైతే ఉద్యోగం, జీతం వివరాలు
  పింఛన్ పొందుతున్న వారైతే అందుకు సంబంధించిన వివరాలు. వికలాంగులైతే సదరం సర్టిఫికెట్  చూపాల్సి ఉంటుంది
      విద్యుత్ కనెక్షన్ ఉంటే నంబరు తెలియజేయాలి
      కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వివరాలు చెప్పాలి
     తాత్కాలిక సంచార కుటుంబం అయితే ఆ వివరాలు ఇవ్వాలి
     18ఏళ్లు నిండితే ఓటరు కార్డు వివరాలు అందజేయాలి

సర్వే సమయంలో భూములు, వాహనాల వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్‌లో వాటిని అమ్మాలనుకున్నా.. వారసులకు ఇవ్వాలనుకున్నా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
     
అధికారులు సర్వే కోసం వచ్చినప్పుడు ఇంటి యజమాని అందుబాటులో ఉండి వాస్తవ సమాచారం ఇవ్వాలి

ఇచ్చే సమాచారంలో అవాస్తవాలు ఉన్నట్లయితే తమను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించవచ్చని, సమాచారం పూర్తిగా వాస్తవమని చెబుతూ సంతకం చేయాల్సి ఉంటుంది.

 ధ్రువీకరణ పత్రం
 సర్వే అధికారులు సర్వే ఫారంలో ‘ఎ’ నుంచి ‘ఐ’ వరకు ఉన్న ప్రొఫార్మాలో అడిగిన వివరాలకు సంబంధించి ఇంటి యజమాని/ కుటుంబ సభ్యులు అందజేసిన వివరాలన్నీ వాస్తవమేనని, ఒకవేళ తాము ఇచ్చిన సమాచారంలో తప్పులు/ అవాస్తవాలు ఉన్నట్లయితే తమను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించవచ్చని, తమపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ధ్రువీకరిస్తూ కుటుంబ యజమాని సంతకం/వేలిముద్ర దరఖాస్తు ఫారం చివరలో చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఎన్యూమరేటర్, పర్యవేక్షణాధికారి ఫారం కింది భాగంలో వివరాలను ధ్రువీకరిస్తూ సంతకాలు చేసి హోదా, ఇతర వివరాలతో పాటు మొబైల్  నంబరు వేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement