
హ్యాట్సాఫ్ వాట్సాప్..
ఉత్తరాలతో సమాచారం చేరవేత అంతంతే, టెలిగ్రామ్ వ్యవస్థే నిలిచిపోయె! మరి అత్యవసర వార్తలు చేరేదెలా? ఎస్టీడీ బూత్‌లు, కాయిన్ బాక్స్‌లకూ కాలం చెల్లింది.. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ నెట్‌వర్కింగ్ సిస్టమే. అందరికీ అరచేత అందుబాటులోకి వచ్చింది. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు యువత, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇంటర్నెట్ వర్కింగ్ సైట్లలో వాట్సాప్ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో సమాచారాన్ని చేరవేసేందుకు మార్గం మరింత సుగమం అయింది.
- సిద్దిపేట రూరల్
సాధారణ పద్ధతిలో మొబైల్ నెట్‌వర్క్‌లో మెసేజ్‌లు పంపాలంటే దానికి నిర్దేశించిన ధర చెల్లించాల్సి వస్తుంది. అధికంగా ఎస్‌ఎంఎస్‌లు పంపాలంటే ఎస్‌ఎంఎస్ ఆఫర్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వాట్సాప్ రావడంతో అటు వంటి ఆఫర్ల అవసరం లేకుండా పోయింది. మొదట్లో నెలకు రూ.10 చొప్పున చెల్లించాల్సి వచ్చినప్పటికీ ఇప్పు డు అంతా ఉచితం అయిపోయింది. ఈ వాట్సాప్ ద్వారా టెక్ట్స్ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, చిన్నచిన్న వీడియో క్లిపింగ్‌లు క్షణాల్లో అవతలి వ్యక్తులకు చేరవేసే అవకాశం కలిగింది. ఈ సోషల్‌నెట్ వర్క్ వల్ల కొన్ని అనర్థాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపయోగమే ఉందనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అందరికీ భలే యూజ్..
వాట్సాప్ నెట్‌వర్క్‌ను అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది ఒక గ్రూపుగా ఏర్పడి వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. పనులను చక్కబెట్టుకుంటున్నారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు రోజువారీ కార్యకలాపాలను ఫొటోలు, వీడియోల రూ పంలో వాట్సాప్‌లో పంపిస్తున్నారు. షాపింగ్‌లో ఏదైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడో ఉన్న తమ కుటుంబ సభ్యులకో, ఇష్టమైన స్నేహితులకో చూపించి వారి చాయిస్‌కు అనుగుణంగా వా ట్సాప్ ద్వారా అప్పటికప్పుడే ఫొటోలు తీసి పంపించి, వారి అ భిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గ్రూపు చాట్స్, లొకేషన్ షేర్ చేసుకోవడం, ఫొటోలు, వీడియోలు పంపించుకోనే వీలుంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచారవ్యవస్థ అందుబాటులోకి రావడంతో వ్యక్తులు, వ్యవస్థల మధ్య దూరం తగ్గిపోయి సంబంధాలు మెరుగుపడుతున్నాయి.
ఎంతో ఉపయోగం..
వాట్సాప్ నెట్‌వర్కింగ్ వ్యవస్థతో సమాచారం చేరవేయడం సులభతరమైంది. పైసా ఖర్చు లేకుండా నెట్‌లో సమాచారాన్ని పంపిస్తూ పనులు చక్కబెడుతున్నాం. సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థను సద్వినియోగపర్చుకుంటే సమాజంలో మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది.
- చంద్రోజు శ్రీనివాస్, టీచర్
క్షణాల్లో సమాచారం..
వాట్సాప్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించుకోని ఫొటోలు, వీడియోలను క్షణాల్లో పంపించవచ్చు. ఈ సదుపాయాన్ని వివిధ ప్రభుత్వ శాఖల్లోను, మీడియా, ఇతర వర్గాలు చక్కగా సద్వినియోగపర్చుకుంటున్నాయి. పని సులభమైంది. డబ్బుల ఖర్చు తగ్గింది.
- రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ సిద్దిపేట రూరల్