వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేద్దాం
కంటోన్మెంట్: వైట్ కాలర్ నేరాల అదుపునకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని నార్త్‌జోన్ డీసీపీ సుమతి పోలీసులను ఆదేశించారు. నార్త్‌జోన్ పరిధిలోని అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసుల రివ్యూ నిమిత్తం శనివారం సాయంత్రం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో నార్త్‌జోన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వైట్ కాలర్ నేరాలు తగ్గడం లేదన్నారు. ముఖ్యంగా చిలకలగూడ, మార్కెట్ పరిధిలో అధికంగా నమోదవుతున్న వైట్ కాలర్ నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత ఏసీపీలు గంగాధర్, శ్రీనివాసరావులను ఆదేశించారు.
ఈ మేరకు త్వరలో విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని సూచించారు. ఇక జోన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న నేరాలకు సంబంధించి వీలైనంత త్వరగా చార్జ్‌షీట్లు వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జనవరి నెలలో నమోదైన 345 కేసులకు గానూ 26కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై కూడా చర్యలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బేగంపేట, మహంకాళి, గోపాలపురం ఏసీపీలు, వివిధ పోలీసుస్టేషన్‌లకు చెందిన ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్సైలు పాల్గొన్నారు.