దాసరిగూడెం (నార్కట్‌పల్లి): ‘‘చేతబడి చేసి నా తండ్రిని పొట్టనబెట్టుకున్నావ్.. ఎప్పటికైనా నిన్ను చంపుతా’’ ఓ యువకుడు ఐదు పదుల వయసు దాటిన వ్యక్తిని పలుమార్లు బెదిరించాడు..అందరూ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు.. కానీ ఆ యువకుడు అతడితో పాటే కూలీ గా చేస్తూ దారుణంగా నరికి హత్య చేశాడు.. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా వృద్ధి చెందుతున్నా..పచ్చని పల్లెల్లో మూఢజాడ్యం పెచ్చరిల్లుతూనే ఉందనడానికి నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెంలో బుధవారం వెలుగుచూసిన హత్యోదంతమే ఉదాహరణ. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆది నుంచి అనుమానాలే..
నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన శ్రీలోజు రామలింగాచారి (55) కులవృత్తితో పాటు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు చొప్పున కుమారులు, కూతుళ్లు ఉన్నారు. అందరి వివాహాలు జరిపించాడు. పెద్ద కుమారుడు జిల్లా కేంద్రంలో ఉంటుండగా, చిన్న కుమారుడితో రామలింగాచారి గ్రామంలోనే నివాసముంటున్నాడు. అయితే కొన్నేళ్లుగా గ్రామంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు రామలింగాచారే కారణమని గ్రామస్తులు భావిస్తున్నారు.
ఇతడు చేతబడి చేయడంతోనే ఆ ఘటనలు చోటు చేసుకున్నాయని వాదనలు బలంగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే గ్రామానికి చెందిన గుడిసె యాదయ్య ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి మృతికి కూడా రామలింగాచారే కారణమని అనుమానిస్తూ అతడి కుమారుడు రాంజనేయులు కక్ష పెంచుకున్నాడు. పలుమార్లు రామలింగాచారిని బాహాటంగానే బెదిరించేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే రామలింగాచారి, రామంజనేయులు ఇద్దరూ కలిసి గ్రామంలోని ఉప్పల లింగారెడ్డి కోళ్ల ఫారంలో కూ లీలుగా పనిచేస్తున్నారని తెలిపారు.
నీ తండ్రిని చంపుతా..!
రామలింగాచారి చిన్న కుమారుడు శంకరాచారి ఇటీవల అత్తగారింటికి వెళ్లడంతో రామలింగాచారి ఇం ట్లో ఒంటరిగా ఉన్నాడు. కాగా, రామంజనేయులు మంగళవారం రాత్రి పూటుగా మద్యం సేవించాడు. శంకరాచారికి ఫోన్ చేసి నీ తండ్రిని చంపుతానని బెదిరించాడు. ఎప్పటిలాగే తాగి వాగుతున్నాడని..ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పానని, ఇలా ఘాతుకానికి ఒడిగడతాడని అనుకోలేదని మృతుడి కుమారుడు శంకర్ వాపోయాడు.
ఒక్కడే ఘాతుకానికి ఒడిగట్టాడా..?
రామంజనేయులు పూటుగా మద్యం సేవించి రామలింగాచారి ఇంటికి వచ్చాడు.కోళ్ల ఫారంలో కోళ్ల లోడ్ ఎత్తేది ఉందని ఇంట్లో ఒంటరిగా ఉన్న రామలింగాచారిని వెంట తీసుకెళ్లాడు. గ్రామంలోని ఆంజ నేయస్వామి ఆలయం వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. రామంజనేయులు కోళ్ల ఫారం యజమాని వద్దకు వెళ్లి రామలింగాచారిని హత్య చేశానని చెప్పి పారిపోయాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సీఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి,ఎస్‌ఐ మోతీరామ్, ఏఎస్‌ఐ గౌస్ పరిశీ లించారు. అయితే హత్య జరిగిన తీరు పరి శీలిస్తే ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడా..? ఇంకెవరైన పాల్గొన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని పోలీసులు చెప్పారు.
పోలీసుల అదుపులో నిందితుడు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రామంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అయితే చేతబడి నెపంతోనే రామలింగాచారిని హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు పేర్కొన్నట్టు తెలిసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
పెచ్చరిల్లిన మూఢజాడ్యం
Published Thu, Mar 5 2015 2:33 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement