బంజారాహిల్స్: పెంపుడు పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని ఆగ్రహించిన ఓ యువకుడు దాని యజమానిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మిథిలానగర్‌లో డాక్టర్ మీనన్ ఇంట్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నల్లాపూర్‌కు చెందిన ఓ బాలుడు(17)తోపాటు హరీశ్వర్‌రెడ్డి అలియాస్ చింటూ(20) అద్దెకు ఉంటున్నారు.
అసోంకు చెందిన ఎజాజ్ హుస్సేన్ (20), బ్రాన్ స్టిల్లింగ్(20) కూడా ఇదే ఇంట్లోని ఓ గదిలో అద్దెకుంటూ సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న రాత్రి ఎజాజ్, బ్రాన్ ఇద్దరూ విధులు ముగించుకొని గదికి వెళ్తుండగా దారిలో కనిపించిన ఓ పిల్లిని వెంట తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లి అరుస్తుండటంతో పక్కనే ఉన్న హరీశ్వర్రెడ్డితోపాటు సదరు బాలుడు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కూడా పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తుండటంతో మద్యం మత్తులో ఉన్న బాలుడు కోపంగా ఎజాజ్ గదికి వెళ్లాడు. అక్కడే ఉన్న బాటిల్లోని పెట్రోల్‌ను ఆయనపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఎజాజ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారంరాత్రి మృతి చెందాడు.
అయితే ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని చనిపోయాడంటూ మొదట ఆ బాలుడితోపాటు హరీశ్వర్‌రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి స్నేహితుడు బ్రాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును తిరగదోడిన పోలీసులు బాలుడితోపాటు హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
(చదవండి: దంపతుల ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment