కృష్ణయ్య, పుష్ప మృతదేహాలు
మిడ్జిల్/ కేసముద్రం: భారీ ఈదురుగాలులు, వర్షానికి టోల్‌ప్లాజా షెడ్డు ఎగిరి ధాన్యం ఆరబెడుతున్న భార్యాభర్తలపై పడటంతో వారు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర సంఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మిడ్జిల్ మండలంలోని మున్ననూర్‌కు చెందిన పేద రైతు దంపతులు డొక్క కృష్ణయ్య (41), పుష్ప(38) తమకు ఉన్న ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశారు. గ్రామ సమీపంలోని జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రహదారిపై టోల్‌ప్లాజాకు 100 మీటర్ల దూరంలో సీసీ రహదారిపై ధాన్యాన్ని ఆరబెట్టారు.
శనివారం సాయంత్రం ఈదురుగాలులు, వర్షం కురుస్తుండటంతో ధాన్యాన్ని కుప్ప చేస్తుండగా ఒక్కసారిగా టోల్‌ప్లాజా షెడ్డు రేకులు ఎగిరివచ్చి వారిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణయ్య, పుష్పకు ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కుమార్తె శ్రీజ మరికల్‌లోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చిన్న కుమార్తె శ్రుతి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందటంతో పిల్లలు అనాథలుగా మారారు. ప్రమాదం జరిగిన సమయంలో కూలిన షెడ్డు కింద సుమారు 60 మంది ఉన్నారు. రేకులు గాలికి ఎగిరి దూరంగా పడటంతో వారికి ప్రమాదం తప్పింది.
ధాన్యం ఆరబెట్టిన చోటకు ఎగిరిపడిన టోల్‌ప్లాజా షెడ్డు రేకులు
తడిసిన ధాన్యం..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ధన్నసరి, కేసముద్రం విలేజ్, ఇనుగుర్తి, తాళ్లపూసపల్లి, పెనుగొండ, కల్వల, కోరుకొండపల్లి, కోమటిపల్లి, కాట్రపల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ వానతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మక్కల రాశులు, బస్తాలు తడిసి ముద్దయ్యాయి. అదే విధంగా కేసముద్రం విలేజ్‌లోని మామిడి తోటల్లో కొమ్మలు విరిగిపడటంతోపాటు, కాయలు నేలరాలాయి. ఇక కేసముద్రం స్టేషన్‌లోని బ్రిడ్జి సమీపంలో చెట్టు విరిగి ప్రధాన రహదారిపై పడింది. తావుర్యా తండా జీపీ శివారు ముత్యాలమ్మ తండాలో పలువురి ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.
ఎగిరిపోయిన టోల్‌ప్లాజా రేకులు
Comments
Please login to add a commentAdd a comment