నాలుగేళ్ల క్రితం మరో మహిళను వివాహమాడి.. | wife brutal murder by Husband | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల క్రితం మరో మహిళను వివాహమాడి..

Published Wed, Jul 1 2015 11:58 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

నాలుగేళ్ల క్రితం మరో మహిళను వివాహమాడి.. - Sakshi

నాలుగేళ్ల క్రితం మరో మహిళను వివాహమాడి..

అతనో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.. అవసానదశలో ఆసరా కావాలని ఓ మహిళను వివాహమాడాడు.. ఒకరికొకరం తోడుగా ఉందామని నమ్మబలికాడు.. ఆపై తనను సరిగా చూసుకోవడం లేదంటూ వేధించాడు. ఇక కాపురం చేయలేను.. తన దారిన తాను వెళ్లిపోతానంటే.. చిత్రహింసలకు గురిచేసి కాటికి సాగనంపాడు..
 
 కిరాతక భర్త చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నాగార్జునసాగర్‌లో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎస్‌కె.షబ్బీర్‌మియా నాగార్జునసాగర్ నీటిపంపిణీ విభాగంలో ఫిట్టర్‌గా పనిచేస్తూ,స్థానిక హిల్ కాలనీలోని చర్చీ పక్కనగల ఏ-520 ప్రభుత్వ క్వార్టర్‌లో నివాసముంటున్నాడు. ఇతడికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు. పిల్లలకు వివాహాల య్యాయి. ఇతడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక  మొదటి భార్యతో పాటు ఆమె పిల్లలు ఐదేళ్ల క్రితం విడిపోయారు.  
 
 నాలుగేళ్ల క్రితం మరో మహిళను వివాహమాడి..
 వృద్ధాప్యంలో ఆసరా కావాలని ఎస్‌కె.షబ్బీర్‌మియా నాలుగేళ్ల క్రితం షేక్ బీపాషా(45)ను వివాహం చేసుకున్నాడు. 2013వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందాడు. షేక్ బీపాషాకు ఇద్దరు కుమార్తెలు రజ్వీనా,జానులతో పాటు కుమారుడు యాకూబ్‌భాషా ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు వాళ్ల అ క్కల వద్దనే ఉంటున్నాడు. వీరిద్దరే సాగర్‌లో ఉంటున్నారు.కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది.
 
 ఆరునెలలుగా..
 తనను సరిగా చూసుకోవడం లేదంటూ షబ్బీర్‌మియా భార్యను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభిం చాడు. ఆరుమాసాల క్రితం భార్య వేళ్లు విరగ్గొట్టాడు. దీంతో చిత్రహింసలు భరించలేక బీపాషా కూతుళ్ల వద్దకు వెళ్లిపోయింది. కొద్ది రోజులు తరువాత వెళ్లి బాగా చూసుకుంటానని నమ్మించి భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. సోమవారం రాత్రి కూడా భార్యభర్త గొడవపడ్డారు. విషయం కాలనీ కులపెద్ద వరకు వెళ్లింది. బీపాషా ఇక ఇతడితో కాపురం చేయలేనని చెప్పడంతో ఆ కులపెద్ద పంపించమని షబ్బీర్‌మియాను మందలించి పంపించాడు.
 
 మరుసటి రోజు మళ్లీ గొడవపడి..
 షబ్బీర్‌మియా మరుసటి రోజు మంగళథవారం రాత్రి భార్యతో మళ్లీ గొడవపడ్డాడు. ఆపై కత్తితో దాడిచేసి, తలను గోడకు బలంగా మోది దారుణంగా హత్య చేశాడు. రాత్రంతా భార్య శవం పక్కనే జాగారం చేసిన షబ్బీర్‌మియా ఉదయాన్నే ఇంటికి తలుపులు పెట్టి వెళ్లిపోయాడు.
 
 వెలుగులోకి వచ్చింది ఇలా..
 షబ్బీర్ మియా ఇంటి నుంచి బయలుదేరి మిర్యాలగూడకు వెళ్లాడు. అక్కడ తనకు తెలిసి న్యాయవాదిని ఫోనులో సంప్రదించి భార్యను హత్య చేసినట్టు వివరించాడు. ఆ తరువాత బీపాషా కూతుళ్లు, కుమారుడికి కూడా ఫోన్ చేసి తల్లిని చంపినట్టు తెలిపాడు. న్యాయవాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాలియా సీఐ పార్థసారథి, సాగర్ ఎస్‌ఐ రజనీకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. తమ తల్లిని కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కూతుళ్లు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా,నిందితుడిని మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement