భర్తను చంపిన భార్య
*తాగిన మైకంలో గొడవ
*అక్కాచెల్లెళ్లతో కలిసి దారుణం
చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: దంపతుల మధ్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. తన అక్కాచెలెళ్లతో కలిసి భార్యే భర్త ఉసురుతీసింది. ఈ దారుణ ఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం...మహబూబ్‌నగర్ తలకొండపల్లికి చెందిన నాగరాజు (35), మహేశ్వరి కులాంతర వివాహం చేసుకున్నారు.
ఉప్పుగూడ కృష్ణారెడ్డినగర్‌లో ఉంటూ కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. తాగుడుకు బానిసైన నాగరాజుకు భార్యతో నిత్యం గొడవ జరిగేది. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం మేహ శ్వరి అక్క విజయలక్ష్మి, చెల్లి గీత కృష్ణారెడ్డినగర్‌కు వచ్చారు. గురువారం రాత్రి నాగరాజు, మహేశ్వరి, విజయలక్ష్మి, గీత కలిసి మధ్య తాగారు. ఈ నేపథ్యంలో నాగరాజుతో వారికి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు రోకలి బండతో నాగరాజు తలపై మోదారు.
ఆ తర్వాత పదునైన రాయితో బలంగా కొట్టారు. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కాచెల్లెళ్లు ముగ్గురూ మృతదేహం వద్దే మద్యం తాగుతూ కూర్చున్నారు. అనంతరం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వేడినీళ్లు నాగరాజు చేతిపై పోశారు. చేయి కాలిపోవడంతో స్పృహకోల్పోయాడని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి శుక్రవారం ఉదయం ఓ ఆటోను పిలిచారు.
అయితే, ఆ ప్రయత్నం విఫలం కావడంతో మృతదేహాన్ని ఇంటి వద్దే వదిలి పారిపోయారు. కాగా, శుక్రవారం సాయంత్రం నాగరాజు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, డీఐ ఆర్.దేవేందర్ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.
పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి భార్య మహేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వనీయంగా తెలిసింది.