బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్‌లో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తిపై జరిగిన కత్తిపోట్ల దాడి సంఘటనకు అతని భార్యే కారణమని పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు వేసిన పథకంలో భాగంగానే ఈ ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రాజరాజేశ్వర సినీ సర్వీసెస్ యజమాని పతంగి రాముపై గుర్తుతెలియని ఆగంతకులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10 సి లోని ఆపిల్-బి స్కూల్ వద్ద కత్తితో దాడికి పాల్పడ్డారు.
అయితే రాము అప్రమత్తం కావటంతో చిన్నపాటి గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. 2002లో గుంటూరుకు చెందిన అంజలిని మహారాష్ట్రకు చెందిన రాము ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదేళ్లుగా రాము సినీ సర్వీసెస్ ద్వారా జనరేటర్లను అద్దెకిస్తున్నారు. వీరికున్న ఇద్దరు పిల్లలు బంజారాహిల్స్‌లోని డీపీఎస్ స్కూల్‌లో చదువుతున్నారు. అయితే కొద్ది కాలంగా రాముకు, అంజలికి మధ్య కుటుంబ తగాదాలు తలెత్తాయి. చిన్నచిన్న విషయాలలలో వీరిద్దరు గొడవలకు దిగారు.
ఈ నేపథ్యంలోనే అంజలికి పరిచయమైన ఓ వ్యక్తి ఆమెకు దగ్గరి స్నేహితుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే భార్య రామును అంతమొందించేందుకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించి అంజలిని విచారించారు. రామును చంపేందుకు తన ప్రియుడితోపాటు మరో ముగ్గురితో కలిసి రూ.5లక్షల సుపారీ కుదుర్చుకొని కొంత మొత్తాన్ని వారికి అందించింది. ఈ నేపథ్యంలోనే రాముపై ఈ దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో సైతం ఇవే నిజాలు వెల్లడించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు మరో రెండు రోజుల్లో వెల్లడిస్తామని పోలీసులు వివరించారు.
భర్తపై దాడికి భార్య సుపారీ..
Published Sat, Oct 10 2015 7:16 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement