భార్యపై దాడి కేసులో భర్తకు జైలు
Published Fri, Dec 2 2016 10:42 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
గుంటూరు లీగల్: భార్యపై దాడిచేసి గాయపరచిన కేసులో భర్తకు 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ ఒకటో అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎంవి రమణ కుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన పాలతీయ నాగరాజుకు 15 ఏళ్ల కిందట ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. భార్య ప్రవర్తనపై నాగరాజు అనుమానం పెంచుకుని ఆమెను వేదించడం ప్రారంభించాడు. 2015 నవంబర్ 21 అర్ధరాత్రి పిల్లలతో కలసి పడుకుని నిద్రిస్తున్న భార్యపై మారణాయుధంతో దాడి చేశాడు. స్థానికులు ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితునిపై నేరం రుజువు చేయడంతో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రమణ కుమారి తీర్పు చెప్పారు. ఏపీపీ పి బాబూరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
Advertisement