అడ్వాన్సు మాఫీ..ఉత్తమాటేనా?
మంచిర్యాల సిటీ : ‘నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రెలు అయినట్టు’ సింగరేణి బొగ్గు గని కార్మికుల పరిస్థితి ఉంది. సింగరేణిలో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నష్టపోయారని భావించి కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు యాజమాన్యం ప్రతి కార్మికుడికి రూ.25 వేలు అడ్వాన్సుగా ఇచ్చింది. యాజమాన్యం ఇచ్చిన అడ్వాన్సును మాఫీ చేయిస్తామని గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ ఇప్పుడు ఆ విషయాన్ని ఎత్తడం లేదు. యాజమాన్యం కూడా అడ్వాన్సును తిరిగి వసూలు చేసుకుంది. ఇచ్చిన హామీని గుర్తింపు సంఘం విస్మరించడంతో కార్మిక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి.
ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రకటన కూడా చేయించకపోవడం శోచనీయం. ఢిల్లీలో అమలు కావలసిన ఆదాయపు పన్ను సమస్యను రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించిన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు స్థానికంగా ముఖ్యమంత్రితో ప్రకటన కూడా చేయించలేకపోయారనే విమర్శ వెల్లువెత్తుతోంది. దీంతో కార్మికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో గుర్తింపు సంఘంతో యాజమాన్యం చర్చలు జరుపనుంది. ఈ సందర్భంలోనైనా అడ్వాన్సు గురించి మాట్లాడుతారా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు.
ఏం జరిగింది
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులు తమ హక్కుల కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011లో 38 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె విజయవంతం అనంతరం 2012 జూన్ 23న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు సమ్మెలో కార్మికులు ఆర్థికంగా నష్టపోయారని భావించి కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని ఒప్పించి ప్రతి కార్మికుడికి 2011 నవంబరు మాసంలో రూ.25 వేలు అడ్వాన్సు రూపంలో ఇప్పించారు.
కార్మికులకు ఇచ్చిన అడ్వాన్సును రద్దు చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో గుర్తింపు సంఘంగా గెలిచిన టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకెఎస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో టీబీజీకెఎస్ గెలిచిన నాటి నుంచి సంఘం అంతర్గత కుమ్ములాటలో పడి సమస్య పక్కకుపోయింది. ఇదే అదనుగా భావించిన యాజమాన్యం ఇచ్చిన అడ్వాన్సును కార్మికుల నుంచి ముక్కు పిండి మరీ వారి వేతనాల నుంచి నెలకు రూ.1,500ల చొప్పున వసూలు చేసుకొంది.
నష్టం
38 రోజుల సమ్మె కాలంలో సింగరేణి సంస్థ రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున 64 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. దీంతో టన్నుకు రూ.2వేల చొప్పున రూ.1,280 కోట్లు సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. కార్మికులు కూడా సగటున రూ.50 నుంచి రూ.70 వేల వరకు ఒక్కొక్క కార్మికుడు వేతన రూపంలో నష్టపోయారు.
కొసమెరుపు
తన చేతిలో ఉన్న అస్త్రాన్ని ఉపయోగించి కార్మికులకు మేలు చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యను పరిష్కారం చేస్తామంటూ ఆదాయపు పన్ను రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయడం కార్మికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.