తెలివిగా మాట్లాడితేనే నాయకులు కాదు! | witty speakers are not leaders, says arun showri | Sakshi
Sakshi News home page

తెలివిగా మాట్లాడితేనే నాయకులు కాదు!

Published Sun, Jan 29 2017 6:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

తెలివిగా మాట్లాడితేనే నాయకులు కాదు! - Sakshi

తెలివిగా మాట్లాడితేనే నాయకులు కాదు!

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో అరుణ్‌శౌరి
- నాయకుల్లో అభద్రతతో వ్యవస్థలు బలహీనపడతాయి.. దేశాన్ని పాలించేవారిని ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి
- నోట్ల రద్దులో చిత్తశుద్ధి లేదు.. నల్లధనమంతా విదేశాల్లోనే ఉందని వ్యాఖ్య
- అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ: జోషి జోసెఫ్‌
- తెలుగు సినిమాలకు మంచి కథలు
- దొరకడం లేదు: ప్రకాశ్‌రాజ్‌
- రెండో రోజు భారీగా తరలివచ్చిన సందర్శకులు
- వివిధ అంశాలపై చర్చలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక, కళా ప్రదర్శనలు  


సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని.. నల్లధనమంతా విదేశాల్లో భద్రంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ జర్నలిస్టు, రచయిత అరుణ్‌ శౌరి వ్యాఖ్యానించారు. కేంద్రం మొదట దొంగనోట్లను అరికట్టేం దుకు నోట్లు రద్దు చేస్తున్నట్లు చెప్పిందని, కానీ అవి కరెన్సీలో కేవలం 0.002 శాతమేనని తేలడంతో నల్లధనాన్ని వెలికితీసేందుకేనంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో రెండో రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమానికి అరుణ్‌ శౌరి ముఖ్య అతిథిగా హాజరై... "నాయకులు వారి అనుచరులకు పాఠాలు" అనే అంశంపై ఉపన్యసించారు.

"ఈ దేశంలో నల్లడబ్బు దాచుకున్న చివరి వ్యక్తి (కేంద్ర మాజీ మంత్రి) సుఖ్‌రామ్‌. అదీ 25 ఏళ్ల కిందట! ఇంక ఇప్పుడు దేనికోసం నోట్ల రద్దు తీసుకున్నట్టు?.." అని ప్రశ్నించారు. ఆర్భాటంగా మాట్లాడటం, పూటకో ఆకర్షణీయ నినాదం ఇవ్వడమే నాయకుల లక్షణం కాదని.. తెలివిగా మాట్లాడటం వివేకం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. గుజరాత్‌ నమూనాలో పది శాతం అభివృద్ధి జరిగినట్లు చెబుతున్నారని, కానీ నిజానికి 6 శాతం అభివృద్ధే జరిగినట్లు ఇటీవల యోగేంద్ర యాదవ్‌ అంచనాల్లో వెల్లడైందని చెప్పారు. తాను ఆరుసార్లు దివాళా తీశాను, ఆదాయ పన్నులు ఎగ్గొట్టానంటూ గొప్పగా చెప్పుకోవడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిత్వాన్ని పట్టి చూపుతోందన్నారు. మోదీ, ట్రంప్‌లాంటి వాళ్లు తమకు అందరూ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పదే పదే ప్రచారం చేసుకోవడం ద్వారా తమ అంతర్గత స్వీయబాధిత ధోరణిని వెల్లడిస్తారని పేర్కొన్నారు.

అభద్రత ఉంటే అంతే..
నాయకుడు అభద్రతకు లోనైతే వ్యవస్థలు ఎలా బలహీనపడతాయో చెప్పేందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చక్కటి ఉదాహరణ అని అరుణ్‌ శౌరీ చెప్పారు. బలహీనులను, రాజీపడగలిగే వాళ్లను, స్వీయ ఆలోచన లేకుండా అడుగులకు మడుగులొత్తేవాళ్లను, పదవికోసం ఎంతటికైనా దిగజారేవాళ్లను ఆమె తన అనుచరులుగా కొనసాగించి, తనలోని అభద్రతను అధిగమించారన్నారు. "నీ చట్టూ ఉన్నవాళ్లు ద్వితీయ శ్రేణి వ్యక్తులు అయినప్పుడు, వాళ్లు తిరిగి తృతీయ శ్రేణి వ్యక్తులను చేరదీస్తారు. ఇది అంచెలంచెలుగా కిందికి పాకుతుంది. ఉదాహరణకు ఒక విద్యా మంత్రి బలహీనుడైతే అంతకంటే బలహీనమైన వైస్‌ చాన్సలర్లను ఎంపిక చేస్తాడు.

రాజకీయాల్లో ఇదే కొనసాగుతోంది.." అని చెప్పారు. సత్యం వేరు, వ్యాపార సత్యం వేరంటూ రెండో దానికి మినహాయింపునిచ్చే ధోరణి ప్రబలిందన్నారు. "లెసన్స్‌ ఫర్‌ లీడర్స్‌ అండ్‌ ఫాలోవర్స్" పేరిట పుస్తకం రాస్తున్నానన్న శౌరీ... వంద కోట్ల జనాభా ఉన్న దేశాన్ని పాలించే నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రజలు చూపాల్సిన జాగరూకతను వివరిస్తూ పాయింట్ల వారీగా ఇచ్చిన ప్రసంగానికి సభికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐశ్వర్యమనిమణ్ణన్‌ ప్రదర్శించిన మార్షల్‌ ఆర్ట్స్‌ సిలంబమ్, లీలాశాంసన్‌ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు, గుస్సాడీ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఆ ఇద్దరూ హిందూమత దీప స్తంభాలు
రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు ఇద్దరూ హిందూ మతానికి రెండు దీప స్తంభాలని అరుణ్‌ శౌరీ పేర్కొన్నారు. సెరిబ్రల్‌ పాల్సీ బాధితుడైన కుమారుడు, పార్కిన్సన్స్‌ బాధితురాలైన భార్య వల్ల తనకు న్యూరోసైన్స్‌ మీద, అద్భుత శక్తులు చూపిన ఈ ఇద్దరు యోగుల మీద ఆసక్తి కలిగిందని.. అందుకే మెదడు శరీరాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశంపై పరిశోధిస్తున్నానని శౌరీ చెప్పారు. దానిపై "టూ సెయింట్స్‌" పేరిట పుస్తకం రాస్తున్నాన్నట్లు చెప్పారు.

తెలుగు సినిమాలకు కథలు దొరకడం లేదు
ఫెస్టివల్‌లో "మీనింగ్‌ ఫుల్‌ సినిమా" అనే అంశంపై జరిగిన చర్చలో సినీనటుడు ప్రకాశ్‌రాజ్, ఫిల్మ్‌ మేకర్‌ నందినీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహూతులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పారు. తెలుగు సినిమాలకు వైవిధ్యంతో కూడిన మంచి కథలు లభించడం లేదని.. ఇలాంటి చర్చలు, సాహిత్య సదస్సుల ద్వారా కొత్త కథకులు, కొత్త కథలు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. సినిమాకు మంచి, చెడు అనేది ఉండదని.. ప్రేక్షకులను స్పందింపజేయగలిగితే చాలునని ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. కథానాయకులు తమ అభిమానులను విపరీతంగా ప్రభావితం చేస్తున్నారనే అంశంపై స్పందిస్తూ.. అది పూర్తిగా నిజం కాదన్నారు. చిరంజీవి, రజనీకాంత్‌ వంటి నటులు అయ్యప్ప మాల ధరిస్తే ప్రజలు కూడా మాల ధరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఏ సినిమా అయినా ప్రేక్షకుల మనోభావాలతో అనుసంధానమైతే అది అర్థవంతమైన సినిమాగానే భావించవచ్చని నందినీరెడ్డి అభిప్రాయపడ్డారు.  

దళారీ వ్యవస్థ ఓ మాఫియా..
లిటరరీ ఫెస్టివల్‌లో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ జోషి జోసెఫ్‌ రాసిన "ఇండియా ఆన్‌ సేల్" పుస్తకంపై చర్చ జరిగింది. దేశంలోని అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ బలంగా వేళ్లూనుకొని ఉందని జోసెఫ్‌ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ మొదలుకుని రాజకీయ, ఆర్థిక, వ్యాపార రంగాల వరకు లంచాలతో దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు ఆ వ్యవస్థ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఒక మాఫియాగా మారిన రాజకీయ రంగం దళారులపైనే ఆధారపడి పాలన కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, లంచగొండితనం వల్లే గ్రామీణ ప్రాంతాలు కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదన్నారు. విమానయాన రంగంలో వ్యవస్థీకృతమైన అవినీతి కొనసాగుతోందని.. ఎయిరిండియాకు తీవ్ర నష్టాన్ని కలిగించడానికి దళారులే కారణమని పేర్కొన్నారు. దళారులతో ఎయిరిండియాను దెబ్బతీసి ఆ రంగంలో తాను ఎదిగేందుకు టాటా శక్తి వంచన లేకుండా ప్రయత్నించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement