బోడుప్పల్ : ఇచ్చిన అప్పును రాబట్టుకునేందుకు కోర్టులో దావా వేసిన పాపానికి ఓ మహిళను ఇంట్లో నిర్బంధించి దాడికి యత్నించిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ అన్నపూర్ణ కాలనీలో నివసించే విద్యారాణికి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో ఓ ఇల్లుంది. దానిని మల్కాజిగిరి ప్రశాంతినగర్‌కు చెందిన రషీద బేగం(42)కు అద్దెకు ఇచ్చింది. రషీద బేగంకు మల్కాజిగిరి మౌలాలికి చెందిన సి.సౌభాగ్యరాణి(58) అనే స్నేహితురాలుంది. విద్యారాణి డబ్బులను ఫైనాన్స్ చేసేది. ఆ విషయం తెలుసుకున్న రషీదబేగం రూ.5 లక్షలు, సాభాగ్యరాణి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారు.
తిరిగి చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా చెల్లించకపోవడంతో విద్యారాణి కోర్టులో కేసు వేసింది. దీంతో రషీదాబేగం, సాభాగ్యరాణికి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఈ క్రమంలో రషీదబేగం, సాభాగ్య రాణి, వారి కుమార్తె స్వాతి(25) ముగ్గురు కలిసి విద్యారాణిని బోడుప్పల్‌లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ ఇంటికి డబ్బులు ఇస్తాం.. ప్రామిసరీ నోటులు తీసుకుని రావాలని కోరారు. నిజమేనని నమ్మి విద్యారాణి అక్కడకు వెళ్లగా వారు ఆమెను ఇంట్లో నిర్బంధించారు. ప్రామిసరీ నోటులు, ఒంటిపై ఉన్న బంగారం ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. ఎట్టకేలకు అక్కడ నుంచి తప్పించుకున్న విద్యారాణి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం పోలీసులు సౌభాగ్యరాణి, స్వాతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రషీదబేగం పరారీలో ఉన్నట్లు ఎస్సై వెంకటయ్య వెల్లడించారు.
దావా వేసిందని రుణదాత నిర్బంధం
Published Mon, Dec 7 2015 7:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM
Advertisement
Advertisement