
యాచారం: వరకట్న వేధింపులకు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండల పరిధిలోని మాల్ గ్రామానికి చెందిన మునుకంటి విశ్వనాథం, ధనలక్ష్మి దంపతుల కుమార్తె మానస(25)ను నగరంలోని చిక్కడపల్లికి చెందిన నవీన్‌కుమార్‌కు ఇచ్చి ఫిబ్రవరిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ. 20 లక్షల కట్నం ఇచ్చారు. అయితే మరింత కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేయడంతో మానస వినాయకచవితికి పుట్టింటికి వచ్చి మాల్‌లోనే ఉండిపోయింది.
కట్నం తెస్తేనే కాపురానికి రావాలని నవీన్ కుటుంబ సభ్యులు ఫోనులో వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్తాపానికి గురైన మానస ఈనెల 2న ఇంట్లోనే ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్ప పొందుతున్న మానస మంగళవారం మృతి చెందింది. వరకట్న వేధింపులకు తాళలేక మానస ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మానస భర్త నవీన్‌తో పాటు ఆయన తండ్రి బాలక్రిష్ణ, తల్లి అను, మరిది నాగరాజు, ఆడపడుచు శరణ్యలపై కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రకుమార్ తెలిపారు.