మహిళా అగ్రిప్రెన్యూర్స్‌! | Women Agripreneurs in Sagubadi | Sakshi
Sakshi News home page

మహిళా అగ్రిప్రెన్యూర్స్‌!

Published Tue, Mar 12 2019 11:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Women Agripreneurs in Sagubadi - Sakshi

వినూత్న ఆలోచనలతో రైతుల జీవితాల్లో మార్పునకు దోహదపడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి పాటుపడటంతోపాటు వ్యవసాయ వ్యాపారవేత్తలు(అగ్రిప్రెన్యూర్స్‌)గా ఎదిగే లక్ష్యం కలిగిన వారికి ‘మేనేజ్‌’(జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ) మార్గదర్శకంగా నిలుస్తోంది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో గల ‘మేనేజ్‌’ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు అనుబంధంగా సేవలందిస్తోంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిణి వి. ఉషారాణి డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అగ్రి క్లీనిక్స్, అగ్రి బిజినెస్‌ సెంటర్స్‌ స్కీంను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ‘ఆర్‌.కె.వి.వై. రఫ్తార్‌’ పథకం ప్రకటించింది. ఈ పథకం కింద స్టార్టప్‌ కంపెనీలను ఏర్పాటు చేసుకునే యువతకు అవసరమైన అనేక అంశాలపై లోతైన అవగాహన కలిగించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం 2 నెలల రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తున్నారు. తొలి బ్యాచ్‌లో 24 మంది ఉన్నారు. అందులో 8 మంది మహిళా ఔత్సాహిక అగ్రిప్రెన్యూర్స్‌ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరిని ‘సాక్షి’ పలకరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి మనోగతం..

పర్యావరణ హితమైన ఎరువులు, పురుగుమందులు అందిస్తా!
రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా భూసారం, పర్యావరణం దెబ్బతింటున్నది. ఈ పరిస్థితి మారాలి. తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్‌ రైతులకు అందుబాటులోకి తేవాలన్నది నా లక్ష్యం. నేను కీటక శాస్త్రంలో పిహెచ్‌డి చేశాను. కొన్ని కలుపు మొక్కల్లో పురుగులను అరికట్టే సహజ రసాయనాలున్నాయని గుర్తించాను. వాటితో బయో పెస్టిసైడ్స్‌ తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలనుకుంటున్నాను. భూమిలో ఏయే పోషకాలు తక్కువున్నాయో ఆయా పోషకాలను అధికంగా అందించే ప్రత్యేక వర్మీ కంపోస్టు ఉత్పత్తులను తయారు చేయాలన్న ఆలోచన ఉంది. ఈ ఆలోచనల సాకారం కోసం ‘మేనేజ్‌’లో ఇంక్యుబేషన్‌ శిక్షణ పొందుతున్నాను. ఆర్థిక వనరులు సమకూర్చుకొని, పరిశ్రమను నెలకొల్పి ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభించాలనుకుంటున్నాను.– డా. అంజలి ప్రసాద్,కీటకశాస్త్ర నిపుణురాలు, సిలిగురి, పశ్చిమ బెంగాల్‌

ఆర్గానిక్‌ కలుపు మందులు తయారు చేస్తా!
అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చదివా. సాయిల్‌ సైన్స్, అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌. పుణెలోని ద్రాక్ష పరిశోధనా స్థానంలో గతంలో రెండేళ్లు పనిచేశా. ఇప్పుడు ప్రభుత్వ విత్తన సంస్థ జిల్లా మేనేజర్‌గా నాకు ఉద్యోగం వచ్చింది. అయినా చేరాలనుకోవడం లేదు. అగ్రి క్లీనిక్‌తోపాటు మట్టి, నీరు పరీక్షించే ప్రయోగశాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. సేంద్రియ ఎరువులు, పురుగుమందులతోపాటు సేంద్రియ కలుపు మందులు కూడా తయారు చేసి రైతులకు అందించాలనుకుంటున్నా. మా విదర్భ ప్రాంతంలో రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు విరివిగా వాడుతున్నారు. వారికి వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. రసాయనిక కాలుష్యం వల్ల, సెలినిటీ వల్ల భూమి కూడా నాశనమవుతోంది. మట్టిని అర్థం చేసుకొని వ్యవసాయం చేయడం అవసరం. అగ్రి క్లీనిక్‌ను నెలకొల్పి రైతుల్లో మార్పు తేవాలనుకుంటున్నా. సేంద్రియ ఉత్పత్తులను తయారు చేసి అందించడం ద్వారా భూసారాన్ని, నేలల ఉత్పాదకతను పెంపొందించడం ద్వారా రైతుల ఆదాయం పెంచాలన్నది నా లక్ష్యం. స్టార్టప్‌ కంపెనీని ఏర్పాటు చేయాలన్న నా లక్ష్య సాధనకు ‘మేనేజ్‌’లో ఇంక్యుబేషన్‌ శిక్షణ చాలా ఉపయోగపడుతోంది.– స్వాతి మగర్, మెహ్‌కర్,బుల్దాన జిల్లా, మహారాష్ట్ర

వర్జిన్‌ కొబ్బరి నూనెఉత్పత్తి చేస్తా!
మాది వ్యవసాయ కుటుంబం. పన్నెండెకరాల పొలం ఉంది. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చదివాను. పచ్చి కొబ్బరి నుంచి వర్జిన్‌ కొబ్బరి నూనెతోపాటు.. కొబ్బరిపొడి, కొబ్బరి ఫ్లేక్స్‌ను ఉత్పత్తి చేసే యూనిట్‌ను నెలకొల్పి అగ్రిప్రెన్యూర్‌గా స్థిరపడాలన్నది నా ఆలోచన. నేను స్వయం ఉపాధి పొందడమే కాకుండా పలువురికి ఉపాధికల్పించడం నా ఉద్దేశం. ఇక్కడ ఇంక్యుబేషన్‌ శిక్షణ చాలా ఉపయోగంగా ఉంది. యూనిట్‌ స్థాపనకు అవసరమైన అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తున్నారు.– ఆర్‌. మోనిక, మూలుకులం, పాండిచ్చేరి

పౌష్టికాహారాన్ని అందిస్తాం!
వేరుశనగలను పండించే చిన్న రైతులతో కూడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి పల్లీలు కొనుగోలు చేసి వాటితో చిక్కీలు తయారు చేసి అంగన్‌ వాడీల్లో పిల్లలకు అందించడం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలన్నది మా ఉద్దేశం. వేరుశనగలతో, పుట్టగొడుగులతో, బాదం, జీడిపప్పు, సామలు, అరికలు తదితరాలతో పిల్లల కోసం వివిధ పౌష్టికాహారోత్పత్తులను తయారు చేయడమే కాకుండా పేదపిల్లలకు అందించాలన్నది మా లక్ష్యం. నేను అగ్రికల్చర్‌ బీఎస్సీ తర్వాత ‘మేనేజ్‌’లోనే ఎంబీఏ చేస్తున్నాను. మార్కెటింగ్‌ తదితర రంగాల్లో నైపుణ్యాలున్న ఐదుగురం కలిసి స్టార్టప్‌ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం. కదిరిలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.  – వసుంధర, రాజంపేట, కడప జిల్లా

తక్కువ ధరకే ఉత్పాదకాలు అందిస్తున్నాం..
పంటలకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు వంటి ఉత్పాదకాలను రైతులు ఎవరికి వారు కావాల్సినప్పుడు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు. దీని వల్ల ఉత్పత్తి వ్యయం బాగా పెరుగుతోంది. ఉత్పాదకాలను తక్కువ ధరకే రైతులకు అందించాలన్న లక్ష్యంతో ‘ఈజీ కృషి’ పేరుతో రెండేళ్ల క్రితం అగ్రి టెక్‌ స్టార్టప్‌ను బెంగళూరు కేంద్రంగా ప్రారంభించాం. 16 రైతు ఉత్పత్తిదారుల సంఘాలలోని 16,500 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నాం. కంపెనీల నుంచి టోకు ధరలకే ఉత్పాదకాలను తెప్పించి నేరుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సరఫరా చేస్తున్నాం. బయటి ధరకన్నా 8–40% మేరకు తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నాం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను అగ్రిక్లీనిక్స్‌గా మార్చే ఆలోచనతో పనిచేస్తున్నాం. అందుకు కావాల్సిన సాంకేతిక, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ‘ఈజీ కృషి’ తరఫున శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నాను.– చైత్ర రావు, ఈజీ కృషి, బెంగళూరు

మహిళలు మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలి!
వ్యవసాయ సంబంధమైన రంగాల్లో వాణిజ్యవేత్తలుగా ఎదగాలనుకునే వారికి, ముఖ్యంగా మహిళలకు, ఇంతకుముందు మేం ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే ఉన్నంతలో ఇంక్యుబేషన్‌ సేవలు అందించేవాళ్లం. ఇప్పుడు ఆర్‌.కె.వి.వై. స్కీము కింద 2 నెలల శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాం. అగ్రికల్చర్‌ కోర్సులు చదవని వారు కూడా స్టార్టప్‌ సంస్థలు పెట్టాలన్న ఉద్దేశంతో వస్తున్నారు. వీరికి అందులోని సాధకబాధకాలను తెలియజెప్పడం, స్టార్టప్‌ కంపెనీని స్థాపించేదెలా? తదితర విషయాలన్నిటినీ తెలియజెప్పడానికి 2 నెలల ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ ఉపయోగపడుతోంది. మహిళలు మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలి. బాస్‌ ఎవరూ ఉండరు కాబట్టి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు చాలా వెసులుబాటు ఉంటుంది. మహిళలకు సృజనాత్మకత, ఆహారం, ఆహార శుద్ధిపై అవగాహన ఎక్కువ కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగ్రిక్లీనిక్స్‌ను ఏర్పాటు చేసే మహిళలు పొందే రుణాలపై 44% సబ్సిడీ కూడా ఉంటుంది. అగ్రికల్చర్‌ పురుషులకు మాత్రమే అనుకూలమైన రంగం కానే కాదు. నవ్యత, మార్కెట్‌ డిమాండ్‌పై అవగాహన, నాణ్యమైన ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికత.. తగిన శిక్షణ పొంది ఈ విషయాలపై పట్టు సాధించగలిగితే మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు విజయాలు చేకూరతాయి. మున్ముందు కూడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తాం. తద్వారా మహిళలు స్వయం ఉపాధి కల్పించుకోవడంతోపాటు మంచి లాభాలు గడించవచ్చు.– వి. ఉషారాణి,డైరెక్టర్‌ జనరల్, ‘మేనేజ్‌’, రాజేంద్రనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement