నీకు పెళ్లి అయిందా? పిల్లలు పుట్టారా? మీ ఆయన బాగానే చూసుకుంటారా?
పార్టీ నువ్వు ఇస్తావా? నన్నే పిలవమంటావా? వయసులో ఉన్నావు కదా.. ఎంజాయ్ చేయ్..!
..ఇలా ఆర్టీసీలోని కొందరు అధికారులు మహిళా కండక్టర్లను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’, ‘స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అంటూ బస్సుల్లో రాసే నినాదాలు ఆ సంస్థ అధికారులకే చెవికెక్కడం లేదనే విమర్శలున్నాయి.
మంకమ్మతోట : ఆర్టీసీలో మహిళా కండక్టర్లపై అధికారుల వేధింపులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొం దరు ఆర్టీసీ అధికారులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెకింగ్ పేరిట రోజులో ఒకే బస్సును రెండు మూడు సార్లు నిలిపివేయడంతోపాటు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని పలువురు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరినవారి పరిస్థితైతే మరీ దారుణం. ఒకే సంస్థలో పనిచేస్తున్న సాటి ఉద్యోగిని అనే ఇంగితం కూడా మరిచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు కన్నీటిపర్యంతమవుతున్నారు.
తనిఖీలో భాగంగా వచ్చే అధికారులు చెప్పలేని మాటలతో హింస్తున్నారని వాపోతున్నారు. డిపోలో అయితే డ్యూటీలు వేయకుండా గేట్ వద్ద కార్యాలయంలో కూర్చోబెట్టుకుని వేధిస్తూ పైశాచికానందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకు చెప్పుకుంటే యూని యన్లు కల్పించుకుని విషయం బయటకు రాకుండా అధికారులకు వత్తాసు పలుకుతున్నారని పేర్కొంటున్నారు. బయట ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ఎదిరిస్తే ఎవరైనా సాయం చేస్తారని, కానీ, సంస్థలో ఎదిరిస్తే వేధింపులు మరింత ఎక్కువై ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. నగరంలోని డిపోల్లోనే ఎక్కువగా వేధింపులున్నట్లు ఆరోపణలున్నాయి.
జాడలేని మహిళా కమిటీ
సంస్థలో మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించి న్యాయం చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం రీజినల్ వ్యాప్తంగా నలుగురు సభ్యులతో మహిళా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో రీజినల్ కార్యాలయం నుంచి అకౌంట్స్ అధికారి లావణ్య, సూపర్‌వైజర్స్ ఉద్యోగుల నుంచి జయలక్ష్మి, డిపో ఉద్యోగుల తరఫున డి.మైథిలి, బయటి సంస్థల నుంచి రాజకీయ నాయకురాలు గుగ్గిళ్ల జయశ్రీ సభ్యులుగా ఉన్నారు. వేధింపులకు గురైన మహిళా ఉద్యోగులు కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు. కమిటీకి అందిన ఫిర్యాదులపై నెలకోసారి సమీక్షించి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదులు అందినా.. అందకపోయినా నెలకోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కమిటీ ఉనికే లేదు. కమిటీ సమావేశం కాక ఏడాదికిపైగా అవుతున్నట్లు సమాచారం.
యూనియన్ నాయకుల జోక్యం
వేధింపులకు గురై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చిన కేసుల్లో యూనియన్ నాయకులు కల్పించుకోవడంతో కమిటీ దాకా ఫిర్యాదులు రావడం లేదు. న్యాయం జరగకపోయినా యూనియన్ నాయకుల ప్రమేయంతో బాధితులు రాజీ పడుతున్నారు. యూనియన్, కమిటీ పరంగా న్యాయం జరగదని భావించిన బాధితులు నేరుగా పత్రికలకు ఎక్కుతున్నారు. ఇటీవల నగరంలోని ఓ డిపో మేనేజర్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి డ్యూటీలు వేసి మానసికంగా వేధిస్తున్నాడని ప్రకటన జారీ చేసిన సంఘటనలున్నాయి. ఎవరికి చెప్పుకున్నా తమకు న్యాయం జరగడం లేదని, అందుకే అన్నీ భరించి రాజీపడి ఉద్యోగం చేస్తున్నామని పలువురు మహిళా కండక్టర్లు వాపోతున్నారు.
పోలీసు మహిళా అధికారి కమిటీలో సభ్యులుగా ఉంటే న్యాయం జరుగుతుందని, వేధింపులకు గురైన వెంటనే సమాచారం అందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. యూనియ న్ల ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా కండక్టర్లపై అధికారుల వేధింపులపై కమిటీ సభ్యులను వివరణ కోరగా.. వేధింపు లు జరుగుతున్నాయని, ఫిర్యాదులు అందడం లేదని తెలిపారు. యూని యన్ల ప్రమేయంతో బయటికి రావడం లేదని పేర్కొన్నారు.
మహిళా కండక్టర్లకు వేధింపులు
Published Sun, Apr 19 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement