జనవరి 24, 25 తేదీల్లో నిర్వహణ: టీఎన్జీవోల నేత దేవీప్రసాద్
హన్మకొండ చౌరస్తా: ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా వచ్చే ఏడాది జనవరిలో అఖిల భారత మహిళా ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో యూనియన్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. హన్మకొండలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఆదివారం జరిగిన సదస్సు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 24, 25వ తేదీల్లో రెండు రోజుల పాటు వరంగల్ నిట్‌లో జాతీయ సదస్సు జరుగుతుందని, సీఎం కేసీఆర్ సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు.
సదస్సు ద్వారా ఆరు దశాబ్దాలపాటు కొనసాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళా ఉద్యోగుల పాత్ర, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తిని చాటుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నూతన ఫించన్ విదానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రేచల్, కన్వీనర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.