మహిళలకు ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు అని పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టేందుకు మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం టి కల్పనాదేవి ఒక్కరు మాత్రమే ఎంపీ గెలుపొందారు. వరంగల్, మహబూబాబాద్ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీలు అతివలకు అవకాశాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం.
సాక్షి, వరంగల్: వరంగల్, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక మహిళా ఎంపీ మాత్రమే ప్రాతినిథ్యం వహించారు. వరంగల్ ఎంపీగా డాక్టర్ టి కల్పనాదేవి 1984లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె కూడా పరాజయం పాలయ్యారు. వరంగల్, మానుకోట రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే 26,657 మంది అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు మహిళలు టికెట్ ఆశిస్తుండగా టికెట్ వచ్చేనే లేదో చూడాలి. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో అతివలకు అవకాశాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు చిన్న చూపుచూస్తున్నాయి.
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో పురుషులతో సమానంగా అవకాశాలు దక్కుతున్నా చట్ట సభలకు వచ్చే సరికి అంతంతమాత్రంగానే ఉంటుంది. వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 15,18,907, మహిళా ఓటర్లు 15,45,564, ఇతరులు 223 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువ ఉండటంతో వచ్చే ఎన్నికల్లోనైనా మహిళలకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. అభ్యర్థిత్వం ఆశించే మహిళలు ఉంటున్నా గెలుపోటములను బేరీజు వేసుకుంటూ రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటుండటంతో టికెట్లు దక్కడం లేదు.
గెలిచి.. ఓడిన కల్పనాదేవి
వరంగల్ లోకసభ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. 1984లో హన్మకొండకు చెందిన డాక్టర్ టి.కల్పనాదేవి తెలుగుదేశం పార్టీ నుంచి వరంగల్ లోక్‌సభ సభ్యురాలిగా గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి కమాలోద్దిన్ అహ్మద్‌పై 8,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరంగల్ లోకసభ ఏర్పాటైనప్పటి నుంచి ఏకైక మహిళా ఎంపీగా చరిత్రలో నిలిచారు. ప్రముఖ వైద్యురాలుగా పనిచేస్తూ టీడీపీ పార్టీలో చేరారు. 1990లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ ఉపాధ్యక్షురాలుగా, ఏఐసీసీ సభ్యురాలుగా పనిచేశారు. 2016 మే 29న గుండెపోటుతో మరణించారు.
ప్రస్తుత ఆశావహులు..
వరంగల్ ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సింగపురం ఇందిర ఆశిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోటీచేసి ఓటమి చెందారు. మానుకోట అభ్యర్థిత్వం విషయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత మానుకోట టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో...గెలుపొంది చట్టసభల్లో ఎవరు అడుగుపెడతారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment