ముచ్చటైన కోట.. 'మొలంగూర్‌' | Wonder construction of Molangur Fort | Sakshi
Sakshi News home page

ముచ్చటైన కోట.. 'మొలంగూర్‌'

Published Mon, Aug 20 2018 1:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Wonder construction of Molangur Fort - Sakshi

మొలంగూర్‌ కోట ప్రవేశద్వారం

శత్రుదుర్భేద్యమైన నిర్మాణంగా ఒకప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న మొలంగూర్‌ కోట నేడు నిరాదరణకు గురవుతోంది. గతంలో అనేక దేవాలయాలతో శోభాయమానంగా వెలిగి, నేడు దైన్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ కోట కరీంనగర్‌కు 30 కి.మీ, వరంగల్‌కు 46 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఎలగందుల, ఓరుగల్లు కోటను కలిపే మార్గానికి మధ్యలో ఉండటంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మొలంగూర్‌ కోటపై కథనం..      
– సాక్షి, హైదరాబాద్‌

చారిత్రక నేపథ్యం.. 
మొలంగూర్‌ గ్రామం పూర్వపు పేరు ముదగర్‌. కానీ కొండకింది భాగాన ‘మంగ్‌ షావలి’సమాధి ఉండటంతో ఈ ఊరు కొంతకాలంపాటు మలంగూరుగా పిలవబడి అదే కాలక్రమంలో మొలంగూర్‌గా ప్రసిద్ధి పొందిందని చరిత్ర చెబుతోంది. కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రు ని అధికారులలో ఒకడైన వొరగిరి మొగ్గరాజు నిర్మించిన శత్రు దుర్భేద్యమైన కోట ఇది. ఈ దుర్గానికి పడమటివైపు నున్నని బండరాయి, ఉత్తరం వైపు కోటపైకి ఎక్కడానికి వీలులేని నిలువైన బండరాళ్లు, దక్షిణ దిశ వైపు కోట ఉన్న కొండకు సమాంతరంగా మరొక కొండ ఉన్నాయి. శత్రువు ప్రవేశించడానికి వీలు లేకుండా ఈ కోట నిర్మించబడింది. 

నిర్మాణ శైలి..  
రెండు గుట్టల నడుమ కోటకు తూర్పు పడమరల్లో రెండు పటిష్టమైన ప్రవేశ ద్వారాలున్నాయి. కొండపైకి వెళ్లడానికి కొంతదూరం వరకు రాతి మెట్లు ఉన్నా, ఆపై ఎవరూ ఎక్కడానికి వీల్లేకుండా క్లిష్ట మైన మార్గం ఉంది. కొండపైకి వెళ్ళే మార్గం చూస్తే ఆ కాలంలో ప్రజలు, ముఖ్యంగా రాజు కోటపైకి ఎలా ఎక్కగలిగారన్న అనుమానం కలుగుతుంది. స్థానికులు మాత్రం కొండపై ఉన్న ఆంజనేయస్వామి దర్శనానికి చాలా అరుదు గా గుంపుగా వెళ్తారు. వారి తోడ్పాటులేనిదే కోట పైభాగానికి చేరుకోవడం ఎవరికైనా కష్టం.

కోట పైభాగంలో చుట్టూ రాతి ప్రాకారం, అక్కడక్కడా బురుజులు, మర ఫిరంగులు మొదలైనవన్నీ శిథిలావస్థలో కనిపిస్తాయి. పైభాగంలో విశాలమైన మైదానం చెట్లు చేమ లతో నిండి ఉంది. రెండు బండరాళ్ల వంపుతో సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు ఒకటి వుంది. కోట లోని ప్రజలు, సైనికుల నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ కోనేరులో అన్ని కాలాల్లోనూ నీరు పుష్కలంగా లభించేదట. ఆసఫ్‌జాహీల కాలంలో ఎలగందుల కోట, రామగిరి కోటతో పాటుగా ఈ కోట కూడా వారి అధీనంలోనే ఉండేది. ఎలగందుల పాలకులలాగే, మొలంగూర్‌ పాలకుల పాలన కూడా ప్రజారంజకంగా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం.

నిర్లక్ష్యం..నిరాదరణ.. 
మొలంగూర్‌ కోటని ప్రభుత్వ అధికారులెవరూ పట్టిం చుకోకపోవడం బాధాకరంగా ఉందని, ఈ కోటను అభివృద్ధి చేసి సందర్శనాయోగ్యంగా మారిస్తే పూర్వ వైభవం సంతరించుకోవడమేగాక, చారిత్రక సంపదను కాపాడుకున్నవాళ్లమవుతాం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీని పైభాగాన ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేయడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి ప్రతి శ్రావణ మాసంలో కొందరు భక్తులు అతి ప్రయాసతో కొండ ఎక్కుతుంటారు. కానీ కోటపైకి వెళ్లడానికి సరైన మెట్లు లేక, పూర్తిగా పైకి ఎక్కలేక మధ్యలోనే నిరాశగా వెనక్కి వెళ్లిపోతుంటారు 

ఆశ్చర్యపరిచే దూద్‌ బావి 
మొలంగూర్‌లోని దూద్‌ బావి నీటి గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఈ గ్రామానికి అత్యంత ప్రాచుర్యాన్ని కలిగించిన దూద్‌బౌలి అనే పేరుగల బావి, కొండ కింది భాగంలో ఇప్పటికీ ఉంది. ఇందులోని నీరు పాల లాగ స్వచ్ఛంగా, తియ్యగా ఉంటాయి. అప్పట్లో ఈ బావిలోని నీటిని ఇక్కడి నుంచి నిజాం కోసం ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళేవారని చెబుతారు. ఇప్పటికీ ఈ బావిలోకి నీరు చేరగానే ప్రజలు బారులు కట్టి తీసుకువెళ్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ నీటిని తెప్పించుకుని తాగడానికి ఆసక్తి చూపేవారట. ఈ నీటిలో నాణెం వేసినా స్పష్టంగా కనిపిస్తుందని, ఈ నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని పరిసర ప్రాంతాల ప్రజలు విశ్వసిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement