
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌కీబాత్’లో చెప్పే మాటలు, ఆయన లోపలి మాటలు పరస్పరం భిన్నమైనవి, మోసపూరితమైనవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. మగ్దూంభవన్‌లో బుధవారం నిర్వహించిన ‘లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం’ అనే అంశంపై సదస్సులో సురవరం మాట్లాడారు. తమకు అనుకూలంగా లేని వారిని దేశద్రోహులుగా, అర్బన్ నక్సలైట్లుగా బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తులు ముద్ర వేస్తున్నాయని విమర్శించారు. నాడు గాంధీని హత్య చేసిన అసహనమే నేడు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో బుసలు కొడుతోందన్నా రు.
మైనారిటీలు, దళితులతోపాటు శాస్త్రీయ ఆలోచనలు ప్రచారం చేసే మేధావులు, భావప్రకటనా స్వేచ్ఛ కోరే ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘ నేతలు దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రస్తుతం మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల దాడి జరుగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలను బలహీనపరచడం ద్వారా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సమావేశానికి డా.సుధాకర్ అధ్యక్షత వహించగా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.