ఆమధ్య రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. తాను పండిట్ నెహ్రూ పేరు చెప్పడాన్ని మర్చిపోతే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుందన్నారు. కానీ నెహ్రూ ఇంటిపేరును కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉపయోగించరని ప్రశ్నించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, రాయ్ బరేలీ ఎంపీ అయిన తన ముత్తాత ఫిరోజ్ గాంధీ ఇంటి పేరును రాహుల్ గాంధీ తన ఇంటి పేరుగా పొందారు. ఫిరోజ్ గాంధీ 1960లో తన 48 ఏళ్ల వయసులో మరణించారు. ఫిరోజ్ గాంధీ అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘంఢీ. ఆయన 1912,సెప్టెంబర్ 12న బొంబాయిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు రతిమాయి, జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ. వీరు పార్సీ మతానికి చెందివారు. జహంగీర్ ఫరేడూన్ ఘంఢీ మెరైన్ ఇంజనీర్.
తండ్రి మరణించినప్పుడు ఫిరోజ్ గాంధీ చాలా చిన్నవాడు. యువ ఫిరోజ్ నాటి రోజుల్లో లేడీ డఫెరిన్ హాస్పిటల్‌లో సర్జన్‌గా పనిచేస్తున్న తన అత్త షిరిన్ దగ్గర ఉండేందుకు అలహాబాద్ చేరుకున్నారు. ఫిరోజ్ అలహాబాద్‌లోని ఎవింగ్ క్రిస్టియన్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. 18 సంవత్సరాల వయస్సులో ఫిరోజ్ గాంధీ జీవితంలో రెండు ముఖ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిది స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం. రెండవది నెహ్రూ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడటం.
ఫిరోజ్ గాంధీ ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ ఆ కళాశాల వెలుపల జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. ఒకరోజు ఆమె అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ఫిరోజ్ ఆమెకు సాయం అందించారు. ఆ రోజుల్లో స్వాతంత్య్ర సమరయోధులకు ‘ఆనంద్ భవన్’ కేంద్రంగా ఉండేది. అక్కడి నుంచే ఫిరోజ్ స్వాతంత్ర్య ఉద్యమ భాగస్వామ్యం కొనసాగింది. అదే సమయంలో ఫిరోజ్ తన ఇంటిపేరులో ‘ఘంఢీ’ని ‘గాంధీ’గా మార్చుకున్నారు. మహాత్మా గాంధీపై గల గౌరవంతోనే ఫిరోజ్ తన ఇంటి పేరును మార్చుకున్నారు.
ఫిరోజ్ గాంధీ ఇందిరా గాంధీతో పరిచయం ఏర్పరుచుకున్నప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు. ఫిరోజ్ ఆమె కంటే 5 ఏళ్లు పెద్ద. కాగా కమలా నెహ్రూ.. ఇందిర, ఫిరోజ్‌ల వివాహాన్ని వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా చాలా తక్కువగా ఉన్నదని అన్నారు. ప్రఖ్యాత జర్నలిస్ట్ సాగరిక ఘోష్ తన పుస్తకం ‘ఇందిర: ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్’లో.. టీబీ కారణంగా కమలా నెహ్రూ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు ఫిరోజ్ ఆమెను చికిత్స కోసం జర్మనీ తీసుకువెళ్లారని రాశారు.
ఇది కూడా చదవండి: లండన్‌లోని ఇండియా క్లబ్ ఎందుకు మూతపడింది? స్వాతంత్య్రోద్యమంతో లింక్ ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment