కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామ శివారులోని పిప్పి ల్యామినేషన్ పరిశ్రమ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పిప్పి ల్యామినేషన్ పరిశ్రమకు చెందిన యంత్రాలను పూణేలోని 3వ యూనిట్‌కు తరలించేందుకు ప్రయత్నించడంతో కార్మికులు అడ్డుకున్నారు. ఫలితంగా యాజమాన్యం షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది.
షాద్‌నగర్ రూరల్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ గేటువద్ద గత 33 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. నష్టాలు వస్తున్నాయన్న నెపంతో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.