‘కొవ్వు కరిగింపు’లో హైదరాబాద్‌ నగరమే టాప్‌ | World Obesity Day Special Story | Sakshi
Sakshi News home page

‘కొవ్వు కరిగింపు’లో హైదరాబాద్‌ నగరమే టాప్‌

Published Fri, Oct 11 2019 11:14 AM | Last Updated on Wed, Oct 16 2019 1:34 PM

World Obesity Day Special Story - Sakshi

తగ్గిన శారీరక శ్రమ.. నిశిరేయిలో విందులు, వినోదాలు. పిజ్జాలు, బర్గర్లు తినడం.. వెరసీ శరీర భాగాలు కొవ్వుతో కొండల్లా మారుతున్నాయి. టీవీలకు అతుక్కుపోయి అదే పనిగా ఏదో ఒక చిరుతిళ్లు లాగించడంతో పీలగా ఉన్నవాళ్లు సైతం పీపాల్లా తయారవుతున్నారు. గ్రేటర్‌లో ప్రతి ఆరుగురు పెద్దవాళ్లలో ఒకరు, ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయం బారినపడే ప్రమాదం పొంచి ఉంది. బాధితుల్లో 65 శాతం మహిళలు, 35 శాతం పురుషులు ఉండటం గమనార్హం.  నేడు ప్రపంచ ఊబకాయ దినం సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పరిస్థితి ఎలా ఉందో తెలియజెప్పే కథనం. 

సాక్షి, సిటీబ్యూరో: ఒబేక్యూర్‌ ఫౌండేషన్‌ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయం కారణంగా ఏటా 28లక్షల మంది మృత్యు వాతపడుతున్నారు. దేశంలో 6.5 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో పట్టణాల్లో 16 శాతం మంది ఉండగా, గ్రామాల్లో 5 శాతం ఉన్నారు. జాతీయ పోషకార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సర్వే ప్రకారం హైదరాబాద్‌ నగర చిన్నారుల్లో ఏడు శాతం మాత్రమే ఉన్న అధిక బరువు బాధితులు, 2013లో 15 శాతానికి పెరిగారు.  తాజాగా ఈ సంఖ్య 18 నుంచి 23 శాతానికి చేరుకున్నట్లు వెల్లడైంది. 30 శాతం మంది పిల్లల లంచ్‌బాక్స్‌ల్లో చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు, కేక్‌లు ఉన్నట్లు తేలింది.

రోజుకెన్ని కేలరీలు అవసరం? 
రోజంతా కష్టించే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రోజుకు సగటున 2300 నుంచి 2500 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా లేని వారు 1400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. కానీ టిఫిన్లు, భోజనంతో పాటు ఫాస్ట్‌ఫుడ్డు కూడా తీసుకుంటే శరీరంలో అదనంగా కేలరీలు పోగుపడతాయి. ఉదాహరణకు రోజుకు 300 కేలరీల చొప్పున ఎక్కువ తీసుకుంటే, ఇలా నెలకు తొమ్మిదివేలు, ఏడాదికి లక్షకుపైగా కేలరీలు శరీరంలో పేరుకున్నట్లే. ఏటా అదనంగా 90 వేల కేలరీలు తీసుకుంటే 5 కేజీల వరకు బరువు పెరుగుతారు. ఇలాగే కొనసాగితే నాలుగైదేళ్లలో 20 కేజీలకుపైగా బరువు పెరుగుతారు.  ఊబకాయం ఓ తీవ్రమైన జబ్బు కాకపోయినా.. పరోక్షంగా మధుమేహం, గుండెపోటు, మోకాలి నొప్పులు, హైపర్‌టెన్షన్, మíహిßళల్లో సంతానలేమి, రొమ్ము కేన్సర్‌కు దారి తీస్తుంది.  

ప్రకటనల మాయలో పడొద్దు
’నెల రోజుల్లోనే 10 కిలోల బరువును తగ్గిస్తాం. ఏడాది క్రితం లావుగా ఉన్న వ్యక్తి. ఇప్పుడెంత నాజూగ్గా మారిపోయాడో’ అంటూ గుప్పిస్తున్న ఆకర్షణీయ ప్రకటనలతో అనేకమంది అటువైపు మొగ్గుచూపుతూ అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ’శాస్త్రీయతతో పనిలేదు.. మేం చెప్పిన ఆహార పద్ధతులు పాటించండి చాలు.. మధుమేహం, అధిక రక్తపోటు,  అధిక బరువు పారిపోతుందని’ చెప్పే ప్రచారార్భాటాలకు లొంగిపోతున్నారు. ఇటీవల ఈ విష వలయంలో చిక్కి పెద్ద సంఖ్యలో బాధితులు అనారోగ్యం పాలయ్యారు. అశాస్త్రీయ ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల తొలుత బరువు తగ్గినట్లుగా అనిపించినా.. శరీర జీవక్రియలో పెనుమార్పులు సంభవిస్తాయి. కండరాలు క్షీణిస్తాయి. ఎముకలు బలహీనమవుతాయి. కాలేయం పనితీరు దెబ్బతింటుంది. మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్లు వంటి సమస్యలు ఎదురవుతాయి.  

అనర్థాలెన్నో..
శరీరానికి కనీస వ్యాయామం ఉండాలి. జంక్‌ఫుడ్డు, బిర్యానీలు, మద్యం, మాంసాహారం, శీతల పానియాలు, స్వీట్లు ఎక్కువగా తీసుకోవద్దు. అధిక బరువు పరోక్షంగా రక్తపోటుకు, గుండెపోటుకు కారణమవుతుంది. అల్పాహారం మానేస్తే సన్నగా మారతామనేది కూడా అపోహ మాత్రమే. బరువు తగ్గేందుకు రోజులో 3 నుంచి 4 గంటలపాటు వ్యాయామం చేయడమూ అనర్థమే. అతి వ్యాయామం వల్ల కండరాల్లో పొటాషియం కరిగి.. రక్తంలో కలుస్తుంది. మూత్రపిండాలు వడపోయడంలో ఇబ్బందులు ఎదురై.. కొన్నిసార్లు వ్యాయామం చేస్తుండగానే గుండె ఆగిపోయి కుప్పకూలిపోతుంటారు.         – డాక్టర్‌ పీఎస్‌ లక్ష్మి, బెరియాట్రిక్‌ సర్జన్, గ్లోబల్‌ హాస్పిటల్‌

మితాహారంతో చెక్‌ 
చిన్న చిన్న మార్పులతోనే దీర్ఘకాలంలో అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు రోజుకు 500 క్యాలరీలు తగ్గించాలనుకుంటే.. తీసుకునే ఆహారంలో 250 కేలరీలు, వ్యాయామం ద్వారా 250 కేలరీలు తగ్గిస్తే.. నెలకు రెండున్నర కిలోలు తగ్గుతారు. తినే కంచం.. సగం కూరగాయల ముక్కలు, సగం ఇష్టమైన ఆహారంతో నిండి ఉండాలి. తగ్గిన బరువును కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే చాలామంది విఫలమవుతుంటారు. మూణ్నెళ్లలో తగ్గిన బరువును కనీసం 18 నెలలపాటు తిరిగి పెరగకుండా చూసుకోవాలి.   – డాక్టర్‌ సుజాత స్టీఫెన్,     పోషకాహార నిపుణురాలు

గ్రేటర్‌.. టాపర్‌.. 
దేశంలో ఎక్కడా లేని విధంగా నిష్ణాతులైన వైద్యులు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య పరికరాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వైద్య ఖర్చులు కూడా చాలా తక్కువ. కేవలం నగరవాసులే కాదు టాంజానియా, ఇథోపియా, కెన్యా దేశీయులు సైతం గ్రేటర్‌ వైద్యులనే ఆశ్రయిస్తుండటం విశేషం. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఏటా 8000 చికిత్సలు జరిగితే, ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 1200కుపైగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఢిల్లీలో నెలకు 50 సర్జరీలు జరిగితే, ముంబైలో 40 ఆపరేషన్లు చేస్తుండగా, గ్రేటర్‌లో వందకుపైగా
చికిత్సలు జరుగుతుండటం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement