యాదాద్రి మాస్టర్‌ప్లాన్ బాగుంది
⇔ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ప్రణబ్ అభినందన
⇔ యాదగిరీశుడిని దర్శించుకున్న ప్రణబ్ ముఖర్జీ
⇔ స్వామివారికి ప్రత్యేక పూజలు.. సువర్ణ పుష్పార్చన.. పట్టువస్త్రాల సమర్పణ
⇔ రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (యాదాద్రి) మాస్టర్‌ప్లాన్ బాగుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఆదివారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. రాష్ట్రపతి రాకకు ముందే సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు చేరుకొన్నారు. ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట శివారులోని వడాయిగూడెం చేరుకున్నారు. వారికి సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వీరి కాన్వాయ్ కొండపైకి చేరుకుంది.
రాష్ట్రపతిని సీఎం కేసీఆర్ ఆలయం ఆవర ణలోకి తీసుకురాగానే ధ్వజస్తంభం నుంచి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రోచ్ఛరణల నడుమ రాష్ర్టపతిని ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు. స్వామి, అమ్మవార్లను ప్రణబ్ దర్శించుకుని 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన చేశారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం లక్ష్మీదేవి అమ్మవారిని, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. మహామండపంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ రాష్ర్టపతిని అర్చకులు ఆశీర్వదించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన స్వామి, అమ్మవార్ల మెమొంటోను సీఎం అందజేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి స్వామివారి మహాప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ప్రణబ్ ఆండాళ్ నిలయానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. 12:50 గంటలకు రాష్ట్రపతి వడాయిగూడెం హెలిపాడ్‌కు బయల్దేరి అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లారు. రాష్ర్టపతి వెంట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఉన్నారు.
రాష్ట్రపతికి మాస్టర్‌ప్లాన్ వివరణ
యాదగిరిగుట్టకు వచ్చిన రాష్ట్రపతికి యాదాద్రి మాస్టర్‌ప్లాన్‌ను సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి వివరించారు. ధ్వజస్తంభం, తూర్పు ద్వారం, నృసింహ కాంప్లెక్స్, నిత్య కల్యాణ మంటపం, భారీ ఆంజనేయస్వామి విగ్రహం గురించి వివరించారు. ఆయా విభాగాల ప్రాశస్థ్యాన్ని రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ విప్ సునీత, ఎంపీ నర్సయ్యగౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యేలు శేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వీరేశం, గాదరి కిషోర్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్ ఉన్నారు.
కట్టె పొంగలి నచ్చింది..
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాదాద్రి కట్టె పొంగలికి అభిమానిగా మారారు. యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంగా ప్రణబ్ కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక వంటకాలను తయారు చేయించారు. అందులో పుళిహోర, దద్ద్యోజనం, లడ్డూ, సిర, ఉప్మాలాంటి సుమారు 8 రకాల వంటకాలున్నాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రణబ్‌కు అధికారులు ఈ వంటకాలను వడ్డించారు. వీటిలో ఆయన కట్టె పొంగలి మాత్రమే తిని, చాలా బాగుందన్నారు. ఇలాంటి వంటకం తాను ఎక్కడా తినలేదని ప్రశంసించారు. అందులో ఏమేమి కలుపుతారంటూ దేవస్థానం అధికారులతో సుమారు 5 నిమిషాలపాటు అడిగి తెలుసుకున్నారు. పొంగలి తయారు చేయించిన అధికారులను, తయారు చేసిన వంట స్వాములను ప్రత్యేకంగా అభినందించారు.