
నల్లగొండ నుంచి ఆవుల లక్ష్మయ్య :
రాష్ట్ర రైతాంగం.. తెల్లబంగారం వైపే మొగ్గుచూపింది. ఈ ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 16,65,759 హెక్టార్లు కాగా, 18,64,614 హెక్టార్లలో సాగు చేశారు. గత ఖరీఫ్‌లో పత్తిని సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో తక్కువ సాగు చేశారు. తీరా మార్కెట్‌లో క్వింటాకు రూ.6,500 వరకు ధర పలకడం, మిర్చి పండించిన రైతులకు మద్దతు ధర దక్కకపోవడంతో ఈ ఖరీఫ్‌లో రైతులు పెద్దఎత్తున పత్తి సాగుకు మొగ్గుచూపారు.
పత్తి వైపే ఎందుకు మొగ్గు
గతఏడాది పత్తి వద్దని అధికారులు భారీగా ప్రచారం చేశారు. ధర ఉండదని రైతులకు అవగాహన కల్పించారు. దీంతో ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాలో పెద్దఎత్తున మిర్చి సాగు చేశారు. మిర్చి ధర గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోయారు. అదే సమయంలో పత్తికి మంచి ధర లభించింది. దీంతో ఖరీఫ్‌లో రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు.
ధర దక్కేనా?
గత ఏడాది మాదిరిగా పత్తికి క్వింటాకు రూ.6,500 వరకు ధర పలుకుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షా లు అనుకూలించడంతో పత్తి దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే గత ఏడాది మిర్చి మాదిరిగానే ప్రస్తుత ఖరీఫ్‌లో పత్తి ధరలు కూడా పడిపోతాయేమోనని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధర నిలకడగా ఉంది.
నల్లగొండ జిల్లాలో అధికం..
నల్లగొండ జిల్లాలో సాధారణ సాగు విస్తీ ర్ణం 2,13,695 హెక్టార్లు కాగా 2,24,995 హెక్టార్లతో సాగై అగ్రస్థానంలో నిలవగా, మేడ్చల్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 124 హెక్టార్లకు గాను కేవలం 53 హెక్టార్ల లో సాగును చేసి చివరిస్థానంలో నిలిచిం ది. ఆదిలాబాద్..1,40,119 హెక్టార్లలో సాగు చేసి రెండో స్థానంలో, నాగర్‌కర్నూల్ జిల్లా 1,13,559 హెక్టార్లలో సాగు చేసి మూడో స్థానంలో, ఖమ్మం జిల్లా 1,08,9 74 హెక్టార్లలో సాగు చేసి నాలుగో స్థానం లో నిలిచాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పత్తి పంటలకు మేలు చేకూర్చనున్నాయి. ఇప్పటికే చేలు ఏపుగా పెరిగాయి. ఈ సారి పత్తి సిరులు కురిపిం చనుందని రైతులు ఆశపడుతున్నారు.