నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌లో పత్తి సాగును తగ్గించాలని జిల్లా వ్యవసాయ శాఖకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది.
పత్తి వైపే మొగ్గు !
Published Sun, Jul 17 2016 11:53 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌లో పత్తి సాగును తగ్గించాలని జిల్లా వ్యవసాయ శాఖకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ అధికారులు కూడా పత్తి వద్దు..ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు సాగు చేయండి అని జిల్లావ్యాప్తంగా ప్రచారం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం పత్తి ఎగుమతిని నిషేధించిన కారణంగా ధర గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. మెట్ట పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సైతం అందుబాటులో ఉంచింది. కానీ.. జిల్లా రైతాంగం అవేమీ పట్టించుకోకుండా పత్తి సాగు వైపే మెుగ్గుచూపుతున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మరో దారి లేక రైతులు తెల్లబంగారాన్నే నమ్ముకున్నారు.
జిల్లాలో సాగు ఇలా..
గత ఖరీఫ్‌లో జిల్లాలో 3.50 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో మాత్రం జిల్లా వ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లకు మించకుండా పత్తి సాగు చేయించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. పత్తి సాగు వల జరిగే నష్టాల గురించి రైతులకు అవగాహన కూడా కల్పించింది. అయితే.. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి వరుణుడు దోబూచులాడుతూనే ఉన్నాడు. చిరుజల్లులకే పరిమితం కావడంతో జిల్లాలో 12 మండలాలో దర్భిక్ష, మరో రెండు మండలాలో అతి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 20 మండలాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. 25 మండలాలో మాత్రమే సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదైంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే రైతులు వరి, ఇతర మెట్టపంటలవైపు మొగ్గుచూపే వారు. అనుకున్న స్థాయిలో వర్షాలు రాకపోవడంతో మరోదారి లేక వారు పత్తిసాగుపై దృష్టి సారించారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,97,721 హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు 1.50 లక్షల హెక్టార్లలో సాగైనట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఈ లెక్కన సాధారణ సాగు విస్తీర్ణంలో 50 శాతం వరకు పత్తి వేసినట్లు తెలుస్తోంది. పత్తి సాగుకు ఈ నెల 31 వరకు అనుకూలం కావడంతో సుమారు మరో లక్ష హెక్టార్లకు పైగా రైతులు విత్తనాలు వేసే అవకాశం ఉంది. పత్తి మొలకెత్తితే వారం రోజులకు ఒకసారి చిరుజల్లులు కురిసినా.. దిగుబడి వస్తుందనే ఆలోచనలో రైతులు ఉన్నారు. వాతావరణ æపరిస్థితుల కారణంగా వారికి పత్తి తప్ప.. మరో మార్గం కనబడడం లేదు. అదేవిధంగా పప్పుధాన్యాల పంటలైన కంది, పెసరను ఆశించిన స్థాయిలో సాగు చేయడం గమనార్హం.
వివిధ పంటల సాగు ఇలా..
పంట సాగు (హెక్టార్లలో)
వరి 13,862
జొన్న 218
సజ్జ 9
మొక్కజొన్న 1,085
కంది 18,881
పెసర 23,490
వేరుశనగ 3,797
నువ్వులు 248
పత్తి 1,50,878
చెరుకు 689
ఇతర పంటలు 462
సోయాబిన్ 151
మొత్తం 2,13,853
Advertisement
Advertisement