
కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న యువకుడిని అడ్డుకుంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ‘మా సమస్యల్ని పట్టించుకోకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అమరుల వివరాలపై ఇంకా స్పష్టత లేదు’ అంటూ రాజ్‌భవన్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కాసేపట్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు తీర్మానంతో రాజ్‌భవన్‌కు వస్తారనగా.. ఈ పరిణామంతో కలకలం రేగింది. మీడియా ప్రతినిధుల మధ్య నుంచి ముందుకొచ్చిన బొప్పాని ఈశ్వర్ అనే వ్యక్తి జైతెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన మీడియా ప్రతినిధులు, పోలీసులు అతడిని నిలువరిస్తున్నా.. నినాదాలు చేస్తూ.. తానెందుకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చిందో వివరించాడు.
ఉద్యమకారులకు ఏం దక్కలేదు..: ‘నా పేరు బొప్పాని ఈశ్వర్ (27). ఓయూ(నిజాం కాలేజీ) పూర్వ విద్యార్థిని. మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి అవురవాణి గ్రామం. ‘తెలంగాణ సామా జిక విద్యార్థి వేదిక’ తరఫున నా నిరసనను తెలుపుతున్నాను. నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు నేటికీ న్యాయం జరగలేదు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల వివరాలపై నేటికీ స్పష్టత లేదు. తెలంగాణ కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాడినా విద్యార్థులైన మాకు ఏం దక్కలేదు.
మేం చదువును పక్కనబెట్టి, లాఠీ దెబ్బలు తిని మిమ్మల్ని (కేసీఆర్) సీఎం చేస్తే మీరు మాకు ఏం చేయలేదు. మీ ఇంట్లో అందరికీ పదవులు వచ్చాయి. మేం మాత్రం చదువులు, ఉద్యోగాలకు దూరమయ్యాం. ఇవన్నీ పరిష్కరించకుండానే పదవీకాలం ముగియకముందే ముందస్తు ఎన్ని కలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈలోగా పోలీసులు వచ్చి అతనిని పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు.