నరేష్‌రెడ్డి (సిడ్నీ) , సంకీర్తన (బెంగళూరు) , వెంకటేశ్వర్లు (గోవా) , వంశీకృష్ణ (కాలిఫోర్నియా)
సిద్దిపేటజోన్: వారు ప్రవాస భారతీయులు, మరికొందరు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. విద్య, వృత్తిరీత్యా , దేశంకాని దే«శం, రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్దిపేటకు చెందిన యువతీయువకులు ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు దాటి సిద్దిపేటకు తరలివస్తున్నారు. ఇప్పటికే విమాన, రైల్వే టిక్కెట్‌లను బుక్ చేసుకున్నారు.
సిద్దిపేట ప్రాంతానికి చెందిన పలువురు అమెరికా, ఆస్ట్రేలియా, అరేబియా దేశాలతో పాటు దేశంలోని బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, గోవాలాంటి నగరాల్లో ఉద్యోగరీత్యా నివాసం ఉంటున్నారు. వీరంతా ఈనెల 7న జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాధ్యతగా తరలివస్తున్నారు. సొంత గడ్డ మీద అభిమానంతో, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఓటేసి గెలిపించుకోవాలనే లక్ష్యంతో వ్యయప్రయాసలకు వెరవకుండా వస్తుండడం విశేషం.
సిద్దిపేట పట్టణంలోని 10వ వార్డుకు చెందిన నరేష్‌రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దేశంలోని సిడ్నీ నగరంలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలోని 2వ వార్డుకు చెందిన వంశీక్రిష్ణ అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. మరోవైపు చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లికి చెందిన చాడ సంకీర్తన (బెంగళూరు)లో పని చేస్తుంది.
అదే విధంగా సిద్దిపేటకు చెందిన వెంకటేశ్వర్లు గోవాలో ఉంటున్నాడు. వీరంతా ఓటు వేయడానికి ఇప్పటికే విమాన టిక్కెట్ బుక్ చేసుకోవడం విశేషం. మరోవైపు సిద్దిపేట పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన అజార్ సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. అతడు ఓటు వేసేందుకు పది రోజుల ముందే సిద్దిపేటకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఎన్నికల అధికారుల సందేశం ప్రవాస భారతీయుల్లో కసిని రగిలించింది.
Comments
Please login to add a commentAdd a comment