ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నాయకులతోపాటు ఆయా పార్టీల కార్యకర్తల్లో కూడా ఆందోళన మొదలైంది. జిల్లాలో మొదటి నుండి రాజకీయ తలనొప్పులకు వేదికగా మారిన హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లో పరిస్థితి కూట మి పార్టీలను కలవరానికి గురి చేస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి ఎవరితో సంబంధం లేకుండా ప్రచారం చేస్తుండగా.. దుబ్బాకలో మాత్రం రోజుకో తీరుగా పరిణామాలు మారడం కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.
సాక్షి, సిద్దిపేట: పొత్తులో భాగంగా దుబ్బాక స్థానాన్ని తెలంగాణ జనసమితి పార్టీకి కేటాయించారు. చివరి నిమిషంలో నాటకీయ పరిణామాల మధ్య మద్దుల నాగేశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పటి వరకు ప్రచార ఆర్భాటం లేకపోవడంతో నియోజకవర్గంలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. మరోవైపు నాగేశ్వర్‌రెడ్డికి ఇచ్చిన బీ ఫారం రద్దు చేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన ఉత్తరం సరైన సమయానికి ఎన్నికల అధికారికి చేరకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఇంతకాలం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేసిన ముత్యం రెడ్డి టికెట్ రాకపోవడంతో గులాబీ కండువా కప్పుకొని.. టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ కేడర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఎన్నికల ముందు మద్దుల హడావుడి
నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ బీఫారం తెచ్చుకున్న ఎంజేబీ(మద్దుల జానా భాయ్) ట్రస్ట్ అధినేత నాగేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నాయకుడిగా ఉన్న నాగేశ్వర్‌రెడ్డి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీ నుండి బయటకొచ్చారు. ట్రస్ట్ కార్యక్రమాలతోపాటు, ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అనుచరవర్గాన్ని పెంచుకున్నారు. కేడర్‌లో ఉత్సాహం నింపారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటి వరకు దుబ్బాక కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ముత్యం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావన్ కుమార్‌రెడ్డిలతోపాటు మద్దుల నాగేశ్వర్‌రెడ్డి రాకతో పార్టీలో టికెట్ పోరు త్రిముఖంగా మారింది. ఈ త్రిముఖ పోటీలో ఎవరికివారే తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలోనే కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీలు ప్రజా కూటమిగా ఏర్పడటంతో టికెట్ పోటీ రసవత్తరంగా మారింది.
పొత్తులో భాగంగా సిద్దిపేటతోపాటు, దుబ్బాక సీటు టీజేఎస్‌కు అప్పగించారు. ఈలోపే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ముత్యం రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చివరి నిమిషం వరకు బీ ఫారం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ముత్యం రెడ్డి మనోవేదనకు గురై టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయితే అప్పటికే కూటమి అభ్యర్థిగా చిన్నం రాజ్‌కుమార్ టీజేఎస్ బీ ఫారంతో నామినేషన్ వేయగా.. సినీ ఫక్కీలో చివరి నిమిషంలో నాగేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ బీఫారంతో నామినేషన్ వేశారు. ఇలా బీఫారం అయితే తెచ్చుకున్న నాగేశ్వర్‌రెడ్డి.. ప్రచారం చేయడంలో మాత్రం అలసత్వంగా ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
బీ ఫారం రద్దుకు ఉత్తమ్ ఉత్తరం
పొత్తులు, టికెట్ల పంపిణీకి ఎవరికి వారుగా> నామినేషన్లు వేశారు. నామినేషన్ స్వీకరణ చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పార్టీ బీ ఫారంతో నామినేషన్ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాగే జరిగింది. దీంతో మళ్లీ సమావేశమైన కూటమి పెద్దలు కొన్నిచోట్ల టీజేఎస్ వారిని, మరికొన్ని కోట్ల కాంగ్రెస్ వారిని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నాగేశ్వర్‌రెడ్డికి అందజేసిన బీ ఫారం రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాశారు.
ఈ నేపథ్యంలో తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉండగా.. మద్దుల మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో దుబ్బాకలో కూటమి అభ్యర్థిగా రాజ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా నాగేశ్వర్‌రెడ్డి ఇద్దరూ బరిలో మిగిలారు. కూటమిలో ఒప్పందం ప్రకారం నాకే టికెట్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నాకే మద్దతు పలుకుతున్నారని రాజ్‌కుమార్ ప్రచారం చేయడం గమనార్హం. ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాసిన ఉత్తరం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గందరగోళంలో కాంగ్రెస్ కార్యకర్తలు
గడిచిన మూడు వారాలుగా దుబ్బాలో చోటుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న ముత్యం రెడ్డి.. టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది కారెక్కారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించినా ప్రచారం చేయడం లేదు. దానికితోడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మద్దుల అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు లేఖ రాశారు.
ఇంతలో పొత్తులో భాగంగా దుబ్బాక స్థానాన్ని పార్టీకి సంబంధం లేని కొత్త వ్యక్తి అయిన చిందం రాజ్‌కుమార్‌కు కేటాయించడంతో కార్యకర్తలు అసహనంతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. కొందరు మాత్రం తప్పదన్నుట్టుగా మొక్కుబడి ప్రచారంతో నెట్టుకొస్తున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కలలు కన్న కార్యకర్తల ఆశలు నీరుగారిపోయాయి. మనసు చంపుకుని కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించలేక, మద్దుల కోసం ఎదురు చూడలేక సతమతం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment