మూడో రోజూ.. అదే జోరు | ys sharmila paramarsha yathra at third day | Sakshi
Sakshi News home page

మూడో రోజూ.. అదే జోరు

Published Thu, Jun 11 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

మూడో రోజూ.. అదే జోరు

మూడో రోజూ.. అదే జోరు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆత్మీయ అనురాగాలు, ఆప్యాయతల నడుమ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా మూడోరోజు గురువారం షర్మిల జిల్లాలోని నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన ఆరు కుటుంబాలను కలిసిన ఆమె .. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలం ఇందుగుల, తిప్పర్తి మండల కేంద్రం, నల్లగొండ రూరల్‌మండలం చందనపల్లి, నల్లగొండ జిల్లా కేంద్రం, నాంపల్లి మండల కేంద్రం, మర్రిగూడ మండలం తానేదార్‌పల్లిలకు వెళ్లిన షర్మిల అక్కడ తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ఆప్యాయతలను పంచారు.

ఆయా కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్న షర్మిల అక్కడ వారు ప్రేమతో తినిపించిన స్వీట్లు, పాయసం తిని వారి చిన్నారులతో ఆడుకున్నారు. పెద్దవారికి బాధ్యతలను గుర్తు చేస్తూ, చిన్నారులు బాగా చదువుకోవాలంటూ సూచించిన షర్మిల ఆయా కుటుంబాలకు తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, షర్మిల పరామర్శయాత్ర శుక్రవారం ముగియనుంది. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిట్ర వసంతరావు కుటుంబాన్ని పరామర్శించడంతో జిల్లాలో మలి విడత పరామర్శయాత్ర పూర్తి కానుంది.

 ముచ్చటగా.... మూడో రోజు
 జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర మూడో రోజు అనురాగం ఆత్మీయతలతో సాగింది. నకిరేకల్ నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరిన షర్మిల మర్రూర్, తిప్పర్తి మీదుగా ఇందుగుల గ్రామానికి వెళ్లారు. ఇందుగుల గ్రామంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరల నుంచే డప్పు చప్పుళ్లతో ఆమెకు స్వాగతం పలికారు. ఇందుగుల సెంటర్‌లో మహిళలు కొలాట చప్పుళ్లు చేస్తూ షర్మిలను పరామర్శ కుటుంబం వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ రాయించు నర్సింహ కుటుంబ సభ్యులను కలిసిన షర్మిల వారికి మనోధైర్యం చెప్పారు. అందరికీ మంచిరోజులు వస్తాయని ధైర్యంగా ఉండాలని సూచించారు. అదే గ్రామంలో కరుణాకర్‌రెడ్డి (గతంలో వైఎస్సార్ ఈ గ్రామానికి వచ్చినప్పుడు కరుణాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడికి రాజశేఖరరెడ్డి అని నామకరణం చేశారు) ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. తన తండ్రి పేరు పెట్టిన రాజశేఖరరెడ్డిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి కుటుంబం షర్మిలకు చీరను బహూకరించారు. అక్కడి నుంచి ఆమె తిప్పర్తి మండల కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో సిలార్‌మియాగూడెంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పులమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిప్పర్తి మండల కేంద్రంలో గుంటి వెంకటేశం కుటుంబ సభ్యులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు నివసిస్తున్న ఇల్లు కులిపోవడంతో ఆరుబయట వెసిన టెంట్‌లోనే వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిలకు వారు గాజులు, పండ్లు, జాకెట్లు బహూకరించారు.

గుంటి వెంకటేశం కుటుంబానికి ధైర్యం చెప్పిన షర్మిల అక్కడి నుంచి నల్లగొండ రూరల్ మండలంలోని చందనపల్లికి వెళ్లారు. చందనపల్లిలో షర్మిలకు ఘనస్వాగతం లభించింది. గ్రామ శివారు నుంచే షర్మిలను పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి డప్పుచప్పుళ్లతో తోడ్కొని వెళ్లారు. భిక్షమయ్య ఇల్లు రేకుల ఇల్లు కాడవం, కరెంట్ లేకపోవడంతో షర్మిలకు చెమటలు వస్తున్నాయి.  అది గమనించిన భిక్షమయ్య కోడలు టవల్ తీసుకుని ప్రేమతో షర్మిలకు చెమటలు పోయకుండా చూసుకున్నారు.

అది గమనించిన షర్మిల వద్దని వారించారు. గ్రామ సర్పంచ్ భర్త భిక్షం మాట్లాడుతూ వైఎస్సార్ ఈ ఊరికి దేవుడని ముంపుకు గురైన తమ గ్రామానికి రూ. 26 కోట్లు మంజూరు చేసి అన్ని సౌకర్యాలు సమకూర్చారని చెప్పారు. మరో స్థానికుడు మాట్లాడుతూ మా గ్రామంలో వైఎస్సార్  విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తే ఆయనను స్మరించుకుంటామని షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. భిక్షమయ్య కుటుంబ సభ్యులు తెచ్చిన స్వీట్లు తిన్న షర్మిల అక్కడి నుంచి నల్లగొండ పట్టణానికి బయలుదేరారు.

మార్గ మధ్యంలో ఖాజీరామారం గ్రామం వద్ద మధ్యాహ్న భోజనం చేసిన ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిమెంట్ రోడ్డులో పాండేకర్ దయానంద్ కుటుంబాన్ని కలిసారు.దయానంద్ ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నారని విషయాన్ని అడిగి తెలుసుకున్న షర్మిల వారిని బాగా చదువుకోవాలని సూచించారు. దయానంద్ భార్య నర్సూబాయ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన  రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. రాజశేఖరరెడ్డి కూతురు మా ఇంటికి రావడమే.. అంటూ షర్మిల చేతిలో చెయ్యి వేసి విలపించారు.

దయానంద్ కుటుంబ సభ్యులు ప్రేమతో ఇచ్చిన కొబ్బరిబొండాను తాగిన షర్మిల అక్కడి నుంచి నాంపల్లి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో కనగల్ సెంటర్‌లో వైఎస్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాంపల్లి వెళ్లిన షర్మిల అక్కడ అస్తర్‌బీ కుటుంబ సభ్యులను కలిసారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబంలోని మూగ వ్యక్తుల గురించి సాక్షి పత్రికలో ప్రచురితమైన మానవాసక్తికర కథనాన్ని షర్మిలకు చూయించారు. అక్కడ షర్మిల అస్తర్ బీ మనుమళ్లతో కాసేపు ముచ్చిటించారు.

8వ తరగతి చదువుతున్న అల్తాఫ్ అనే విద్యార్థిని నువ్వేం చదువుకుంటావ్ అని ప్రశ్నించగా అతను పోలీస్‌ను అవుతానని చెప్పడంతో షర్మిల నవ్వులు చిందించారు. పరామర్శ అనంతరం అస్తర్‌బీ కుటుంబం ఎదుట పెద్ద ఎత్తున గూమిగూడిన ప్రజలను వర్షంలోనే తడుస్తూ పలుకరించారు. షర్మిలతో కరచాలనం చేసేందుకు వర్షంలోనూ స్థానికులు పోటీపడ్డారు. అక్కడ నుంచి ఆమె మర్రిగూడ మండలం తానేదార్‌పల్లి గ్రామానికి వెళ్లి మునగాల పుల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.

మార్గమధ్యంలో నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. తానేదార్‌పలిల్లో పుల్లమ్మ మనువడు, మనువరాళ్లను బాగా చదువుకోవాలని, కుటుంబానికి ఉపయోగపడేలా స్థిరపడాలని సూచించారు. పరామర్శ జరుగుతున్న ఇంటి వద్ద గూమికూడిన ప్రజలను పలుకరించి చౌటుప్పల్‌లోని అన్నా మెమోరియల్ పాఠశాలకు వెళ్లి రాత్రి బసచేశారు.
 
  ఎన్టీఆర్.. ఆ తర్వాత వైఎస్
  తానేదార్‌పల్లిలో పరామర్శను ముగించుకుని బయటకు వచ్చిన షర్మిలను బండి జంగమ్మ అనే వృద్ధురాలు పలకరించారు. తాను కూడా రాజకీయాలు చేశానని చెప్పిన ఆమె ఇప్పటి రాజకీయాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎవరూ పేదల గురించి పట్టించుకోవడం లేదని, కార్లలో తిరుగుతున్న వారికే పనులవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్సార్‌లే పేదలకు న్యాయం చేశారని షర్మిలకు చెప్పారు.

షర్మిల వెంట రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు డాక్టర్. గట్టు శ్రీకాంత్‌రెడ్డి,  కె. శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, ఎడ్మ కృష్ణారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి,  పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, సేవాదళం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ ముజ్తబా అహ్మద్,  రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ పి. సిద్దార్థరెడ్డి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు  ఇరుగుసునీల్‌కుమార్, పిట్ట రాంరెడ్డి, ఎం.డి.సలీం, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా, యువజన విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్, మేడిశెట్టి యాదయ్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement