
అండగా ఉంటాం, అధైర్యపడొద్దు: వైఎస్ షర్మిల
వరంగల్ : వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చివరి విడత పరామర్శ యాత్ర కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు సోమవారం నుంచి జిల్లాలో చివరిదశ పరామర్శ చేపట్టారు. 11 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం లోటస్ పాండ్ నుంచి మంగపేట మండలం బండారిగూడెం చేరుకున్న షర్మిల... ఆ గ్రామంలోని దోమగండి ముత్తయ్య కుటుంబీకులను పరామర్శించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణ వార్తను తట్టుకోలేక ముత్తయ్య ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. అనంతరం అదే మండలం రాజుపేటలోని దుబ్బ ముత్తయ్య కుటుంబాన్ని, గోవిందరావుపేట మండలం దుంపెల్లి గూడెంలో దేవిరెడ్డి రాంచంద్రారెడ్డి కుటుంబాన్ని, చల్వాయిలోని మేడిపల్లి అమ్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు.
అధైర్య పడవద్దని... మీరంతా మా కుటుంబమే అని వారికి ధైర్యం చెప్పారు. కష్టాల్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చివరిగా బుస్సాపూర్ లోని బేతి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. కాగా తొలిదశలో 32 కుటుంబాలను, రెండోదశలో మరో 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం సాయంత్రం భూపాలపల్లి మీదగా ఈ యాత్ర కరీంనగర్లో ప్రవేశిస్తుంది.