
మంచి రోజులు మళ్లీ వస్తాయి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘అంతా మంచే జరుగుతుంది. మీరు ఇక నుంచి మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్లీ వస్తాయి...’’ అని వరంగల్ జిల్లాలో వైఎస్సార్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు షర్మిల భరోసా కల్పించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన చివరి దశ పరామర్శ యాత్ర సోమవారం మొదలైంది.
ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరిన షర్మిల భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్, ములుగు మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు మంగపేట మండలం బండారిగూడెం చేరుకున్నారు. షర్మిలకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు కొండా రాఘవరెడ్డి, బీష్వ రవీందర్, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మొదటి రోజు ములుగు నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. పూర్తిగా అటవీ ప్రాంతంలో సాగిన యాత్రలో షర్మిలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు రహదారులపైకి వచ్చారు. అడుగడుగునా ఆత్మీయతతో ఆదరించారు.
యాత్ర సాగిందిలా..
తొలుత ములుగు నియోజకవర్గం మంగపేట మండలం బండారిగూడెంలోని దోమగండి ముత్తయ్య ఇంటికి షర్మిల వెళ్లారు. ముత్తయ్య భార్య దోమగండి నర్సమ్మను పరామర్శించారు. అక్కడ్నుంచి ఇదే మండలం రాజుపేటలోని దుబ్బ ముత్తయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుబ్బ ముత్తయ్య భార్య కృష్ణకుమారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఏటూరునాగారంలోని వలస చిన్నక్క ఇంటికి చేరుకున్నారు. ‘ధైర్యంగా ఉండండి.. మీకు అండగా ఉంటా..’ అంటూ చిన్నక్క కుమారుడు కృష్ణమూర్తికి భరోసా కల్పించారు.
అనంతరం గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడంలోని దేవిరెడ్డి రాంచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడ్నుంచి చల్వాయిలోని మేడిపల్లి అమ్మాయమ్మ ఇంటికి వెళ్లి.. ఆమె కోడలు రాంబాయమ్మను పరామర్శించారు. చివరగా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌లోని బేతి వెంకట్‌రెడ్డికి ఇంటికి వెళ్లి వారి కుటుంబీకులతో మాట్లాడారు. మంగళవారం ములుగు, భూపాలపల్లి నియోజకవర్గంలోని ఐదు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. దీంతో వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ముగియనుంది.
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నే తృత్వంలో జరిగిన పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, ఆరె లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్ద దిక్కును కోల్పోయాం..
వైఎస్సార్ మృతితో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్లే అయ్యిందని పలువురు షర్మిలతో వాపోయారు. ‘‘మీ నాయన మా కోసం ఎంతో చేశారు. అప్పుడే పింఛన్లు ఇచ్చుడు షురూ జేసిండ్లు. ఆరోగ్యశ్రీ, 108 సర్వీసు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ... ఎన్నో చేసిండ్లు. వైఎస్ పోయాక అలా లేదు. ఇప్పుడు రుణమాఫీ అంతా అయోమయంగా ఉన్నది’’ అని మంగపేట మండలం రాజుపేటలోని దుబ్బ ముత్తయ్య బంధువులు చెప్పారు. ‘‘వైఎస్ ఉంటే మాకు భరోసా ఉండేది.
ఇంత దూరం మా కోసం వచ్చావా అమ్మా... మీరు చల్లగా ఉండాలి’ అని ఏటూరు నాగారానికి చెందిన వలస చిన్నక్క కుటుంబ సభ్యులు షర్మిలతో అన్నారు. మొదటి రోజు షర్మిల ఆరు కుటుంబాలను పరామర్శించారు. మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల మీదుగా యాత్ర సాగింది. 108 కిలోమీటర్ల యాత్రలో దారిపొడవునా షర్మిలకు ప్రజలు అభివాదం చేస్తూ ఘన స్వాగతం పలికారు.
డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్షలు చేస్తున్న ఆశా వర్కర్లు మంగపేట, ఏటూరు నాగారంలో షర్మిలను కలిసి తమ కోసం పోరాడాలని కోరారు. తమ పార్టీ అండగా ఉంటుందని షర్మిల వారితో అన్నారు. ములుగును జిల్లా కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలు షర్మిలకు, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. మూతపడిన బిల్ట్ కాగితం గుజ్జు పరిశ్రమను తెరిపించేందుకు సహకరించాలని ఆ పరిశ్రమ కార్మికులు కమలాపురంలో షర్మిలను కోరారు.