వైఎస్ ఆశయాలను కొనసాగిద్దాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/వరంగల్: ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిపి పేదల కు 46 లక్షల ఇళ్లను కట్టిస్తే దివంగత మహానేత రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఒక్క మన రాష్ట్రంలోనే 46 లక్షల పక్కా ఇళ్లను కట్టి చూపించారు. ఆయన బతికుంటే ఈ రోజు ప్రతి పేదవాడికీ ఇల్లుండేది. ప్రతి ఎకరాకూ నీళ్లొచ్చేవి. ప్రతీ విద్యార్థి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేవాడు..’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్ లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని చెప్పారు.
అందుకోసం అందరం చేయి చేయి కలిపి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంగళవారం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాటారంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోతే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కొన్ని వందల గుండెలు ఆగిపోయాయి.
ఒక నాయకుడు లేకపోతే వందల గుండెలు ఎందుకు ఆగిపోయాయి? అంతమంది ఎందుకు అభిమానిస్తారు? ఎందుకంటే.. ప్రజల గుండెల్లో బాధను తన బాధగా మార్చుకున్న వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసిన నాయకుడాయన. పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపించిన మహా నాయకుడు. తన చేతనైనంత మేరకు ప్రతి ఒక్కరికీ మేలు చేసిన నేత. వైఎస్ చనిపోయి ఆరేళ్లవుతున్నా ఈ రోజు వరకు కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు..’’ అని షర్మిల అన్నారు.
వరంగల్‌లో 73 కుటుంబాలకు పరామర్శ
వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర ముగిసింది. మూడు దశల్లో 12 రోజులపాటు జిల్లాలో యాత్ర కొనసాగింది. మొత్తం 73 కుటుంబాలను పరామర్శించారు. చివరి రోజు మంగళవారం భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో 11 కుటుంబాలను పరామర్శించా రు.
ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ఎండీ ఫహీముద్దీన్ కుటుంబాన్ని, బావుసింగ్‌పల్లిలోని ఆజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. భూ పాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని కోటగిరి రవీందర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఇదే మండలంలోని ధర్మారావుపేటలోని గంపల లక్ష్మీ కుటుంబానికి భరోసా కల్పించారు. చివరగా భూపాలపల్లి మండలం జంగేడులోని గట్టు నల్లపోశాలు కుటుంబాన్ని పరామర్శించారు.
నూటొక్క దీపాలతో స్వాగతం..
షర్మిల పరామర్శ యూత్ర మంగళవారం వరంగల్ జిల్లాలో ముగిసి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. కాటారం మండలం మేడిపల్లి వద్ద పార్టీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాష్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గెం రాజేష్ ఆధ్వర్యంలో షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం వెళ్లిన షర్మిల... వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అసోదుల రాములు కుటుంబాన్ని పరామర్శించారు.
దాదాపు అరగంటకుపైగా వారితో గడిపి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టమొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం కాటారం వచ్చిన షర్మిలకు వైఎస్ అభిమానులు, పార్టీ శ్రేణులు నూటొక్క దీపాలతో స్వాగతం పలికారు. జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర తొలిరోజు 82 కిలోమీటర్లు సాగింది. రెండు జిల్లాల్లో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పరామర్శ యాత్రలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాసరావు, నాయకులు వెంకటరెడ్డి, సొల్లు అజయ్‌వర్మ, ఎం.రాజమ్మ, మైనారిటీ, సేవాదళ్, విద్యార్థి విభాగం, ప్రోగ్రాం కమిటీ అధ్యక్షులు సలీం, సుధాకర్, దేవరనేని వేణుమాధవరావు, పారుపల్లి వేణుమాధవరావు, అప్పం కిషన్, కాయిత రాజ్‌కుమార్ యాదవ్, సంగాల ఇరికియం, రవితేజారెడ్డి, సుమిత్‌గుప్తా, ఎల్లాల సంతోష్‌రెడ్డి, కె.శంకర్, మతిన్‌ముజదాది, ఎం.విలియం, ఎన్.శాంతికుమార్, ఆరె లింగారెడ్డి పాల్గొన్నారు.