
21 నుంచి నల్లగొండలో వైఎస్ షర్మిల యాత్ర
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈనెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారు.
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈనెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం తెలంగాణ కమిటీ సమావేశమైంది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏడు రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని, మిగిలిన కుటుంబాలను ఫిబ్రవరిలో షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. అలాగే వరంగల్ జిల్లా హన్మకొండలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని ఈనెల 12న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్ షర్మిల అంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేశారు.