ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు | YSRCP 9th Foundation Day Celebrations At Party Central Office | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

Published Tue, Mar 12 2019 11:30 AM | Last Updated on Tue, Mar 12 2019 1:39 PM

YSRCP 9th Foundation Day Celebrations At Party Central Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంటేశ్వర్లు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, లక్ష్మీపార్వతి, జంగా కృష్ణమూర్తి, ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మారెడ్డి వెంటేశ్వర్లు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డితో కలిసి కేక్‌ కట్‌ చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా 12, మార్చి 2011న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది.

వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ‘విజయవంతంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 9వ వసంతంలోకి అడుగుపెట్టింది. జనహృదయ నేత రాజన్న సిద్ధాంతాలను కొనసాగించాలనే ధ్యేయంతోనే యువజన శ్రామిక రైతు పార్టీ అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యాం. అయినా, అది ఓటమిగా భావించడం లేదు. ఈ ఐదేళ్ల టీడీపీ నిరంకుశ పాలనలో ఎన్నో అక్రమాలు చోటు జరిగాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లాగే శర్మిలమ్మ పాదయాత్ర చేశారు. వైఎస్‌ జగన్‌ కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచారు. 14 నెలల సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టి 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఎన్నో గొప్ప ఆశయాలు గల మన పార్టీ తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులు పోయి మంచి రోజులు వస్తాయి. ఆయనకు ఓసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.

ప్రజల పక్షాన నిలిచిన పార్టీ..
విజయవాడ: పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ నగర వర్కింగ్‌ ప్రెసెడెంట్‌ మల్లాది విష్ణు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావు, నాగిరెడ్డి, గౌతంరెడ్డి, ఆసీఫ్, తోట శ్రీనివాస్, మహబూబ్, ఎంవీఆర్ చౌదరి, పుల్లారావు, గౌస్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మల్లాది విష్ణు మాట్లాడుతూ... ‘ఆవిర్భావం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల కోసం పాటుపడుతోంది. ప్రజల పక్షాన నిలిచిన రాజకీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. రాజన్న పాలన మళ్లీ అందించాలంటే అది ఒక్క వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం. వైఎస్సార్‌ అకాల మరణం తర్వాత ప్రజల ఆవేదన నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌పై టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నా.. వాటిని తట్టుకుని మన పార్టీ ముందుకు సాగుతున్నది’ అన్నారు. చంద్రబాబు నరకాసుర పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.  టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలివేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ నవరత్నాలను ప్రకటించినప్పుడు అపహస్యం చేశారని, కాని నేడు వాటినే చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అవినీతి పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడనున్నారని జోస్యం చెప్పారు.

వైయస్సార్ జిల్లా: రాజంపేటలోని వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటీ అమరనాథ్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

వైయస్సార్ జిల్లా: జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుధీర్ రెడ్డి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు.

(ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు : వైఎస్‌ జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement